
20 రూపాయల డాక్టర్!
వైద్యం చాలా ఖరీదైన వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. మన పురాణాలు మాత్రం వైద్యులు ఉచితంగానే వైద్యం చేసేవారని, వారి చేతి స్పర్శకే నయమైపోయే జబ్బులు ఉండేవని చెబుతాయి. అలాగని ప్రస్తుత పరిస్థితుల్లో ఉచితానికి వైద్యం చేసేవారిని ఊహించడం, ఆశించడం అత్యాశే. కానీ, నామమాత్రం ఫీజు తీసుకుని జబ్బులను తరిమికొట్టే వైద్యులు మాత్రం అతికొద్దిమంది మన దేశంలో ఉన్నారు. వారిలో డాక్టర్ బాలసుబ్రమణ్యన్ మరింత ప్రత్యేకం..!
20 రూపాయల డాక్టర్ గురించి మీరెప్పుడైనా విన్నారా? కోయంబత్తూరులో ఆ పేరు తెలియని వారుండరు. వైద్యో నారాయణో హరి అంటారు కదా.. ఆ నానుడికి నిలువెత్తు రూపం ఆయన. పేదలకు ఆయనే నారాయణుడు. ఆయనే హరి. సిద్ధపూడూరు ఏరియాలో ఉండేది బాలసుబ్రమణ్యన్ క్లినిక్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఉద్యోగ విరమణ తర్వాత, ఖాళీగా ఉండలేక ఒక డిస్పెన్సరీ పెట్టాడు. సంపాదించుకుందాం, పోగేసుకుందాం అనే ఉద్దేశంతో కాదు. తనకు తెలిసిన వైద్యంతో పేదవారికి ఎంతోకొంత సేవ చేయాలని! రోజుకి 150 నుంచి 200 మంది రోగులని చూసేవాడు. మాత్రలతో తగ్గితే మాత్రలు. లేదంటే ఇంజెక్షన్. ఫీజు నామమాత్రం.
మొదట్లో మనిషికి రెండు రూపాయలు మాత్రమే స్వీకరించేవాడు. కొన్నాళ్లకు పది రూపాయలు. ఈ మధ్యనే 20 రూపాయలు తీసుకున్నాడు. అది కూడా ఇచ్చుకోలేనివారికి ఉచితంగానే సేవలందించేవాడు.ఈ మాత్రం కూడా ఆయన వసూలు చేయకపోయేవాడే. కానీ, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు కొనడం రోజురోజుకూ కష్టమయ్యేది. దీనికి తోడు క్లినిక్ అద్దె. వీటన్నిటి మూలంగా ఆ మాత్రం ఫీజు తీసుకోక తప్పలేదు ఆయనకి. నర్సులు లేరు. అసిస్టెంట్లు లేరు. అన్నీ తానై చూసేవాడు. చుట్టుపక్కల నుంచి వందలాది మంది నిరుపేదలు బాలసుబ్రమణ్యన్ దగ్గరికి వైద్యం కోసం వచ్చేవారు. పేషంట్ల జబ్బు నయం చేయడం అతనివల్ల కాలేదంటే.. తెలిసిన మంచి స్పెషలిస్టు దగ్గరికి పంపిస్తాడు. పెద్దాయన మీద గౌరవంతో ఆ డాక్టర్లు పెద్దగా ఫీజు తీసుకునేవాళ్లు కాదు.అయితే ఒకరోజు ఆయన చేతులు అచేతనంగా పడిపోయాయి.
పేదల గుండెకు తన గుండె ఆన్చి చూసిన ఈ మనసున్న వైద్యుడి గుండె హఠాత్తుగా ఆగిపోయింది. నిరుపేదల డాక్టర్ శాశ్వతంగా దూరమయ్యారన్న వార్త స్థానికులను కలచివేసింది. కోయంబత్తూరు గల్లీగల్లీ వాడవాడనా కన్నీటి ధారలు కట్టాయి. ఆయనతో ముఖపరిచయం లేనివారు కూడా అయ్యో అన్నారు. ఆయన చేతిమాత్ర పుణ్యమా అని బతికినవారు గుండెలవిసేలా రోదించారు. సుబ్రమణ్యణ్యన్ డాక్టర్ ఇక కనిపించరన్న చేదునిజాన్ని జీర్ణించుకోవడం ఎవరివల్లా కాలేదు.కొన్ని వేల మంది ఆయన్ని కడసారి చూడ్డానికి వచ్చారు. ఓ వైద్యుడి అంతిమ యాత్రకు అంతమంది హాజరవ్వడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. కన్నీటి ధారల నడుమ ఆయన అంతిమయాత్ర సాగింది. పేదల కోసం పాటుపడిన ఈ వైద్యుడికి ఘనమైన నివాలి అందించారు సామాన్యులు. ఇరవై రూపాయల డాక్టర్ వారి గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటాడు.