
నెటిజన్ల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కేంద్రం
మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తంచేయాలంటూ చేసిన ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది.
న్యూఢిల్లీ: మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తం చేయాలంటూ చేసిన ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఎలాంటి గోప్యతకు తావు లేకుండా ఉన్న తాజా పాలసీపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ఇది ముసాయిదానే తప్ప ఫైనల్ పాలసీ కాదంటూ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పౌరులు వినియోగిస్తున్న మెసెంజర్లనుద్దేశించి ఈ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన సోషల్ మీడియాకు వర్తించదని తెలిపారు. ప్రస్తుత ముసాయిదాను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు. ఇది ఫైనల్ కాదని, మరింత స్పష్టంగా దీన్ని మళ్లీ రూపొందిస్తామని ఆయన తెలిపారు.
కాగా మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తం చేయాలంటూ కొత్తగా సిద్ధంచేసిన ‘సంకేత నిక్షిప్త సందేశాల పాలసీ’ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త ముసాయిదా ప్రకారం... వాట్సప్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ లేదా మరే ఇతర సేవల ద్వారా మొబైల్, కంప్యూటర్‌లో వచ్చే సందేశాలను మూల వాక్యాల రూపం(ప్లేన్ టెక్ట్స్ ఫార్మాట్)లో దాచి ఉంచాలి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వారు తయారుచేసిన ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 15లోగా కేంద్రానికి తెలపాల్సి ఉంటుందని కూడా పేర్కొంది.
కాగా సమాచారాన్ని సేకరణ ప్రక్రియభద్రతా సంస్థలకు కష్టంగా మారడంతో కొత్తగా తీసుకువస్తున్నామంటున్నఈ పాలసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందని విమర్శించారు. దీంతో కేంద్ర ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది.