డ్రైవర్ నిద్రపోతే.. ప్యాసింజర్ టాక్సీ నడిపాడు!
పగలు, రాత్రి అని తేడా లేకుండా టాక్సీ నడిపే డ్రైవర్లకు మధ్యమధ్యలో కాస్తంత నిద్ర రావడం సహజం. అలాగని బేరాలు పోగొట్టుకోవడం కూడా వాళ్లకు ఇష్టం ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే గుర్‌గావ్‌లో ఓ టాక్సీ డ్రైవర్‌కు ఎదురైంది. అయితే, సదరు ప్యాసింజర్ మంచివాడు కావడం అతడికి కలిసొచ్చింది. ఈ వ్యవహారం అంతా 9 సెకండ్ల వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో ఆ ప్యాసింజర్ అప్‌లోడ్ చేశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత గిల్ అనే ఫైనాన్షియల్ అనలిస్టు దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుంచి డీఎల్ఎఫ్ ఫేజ్2లో గల తన ఇంటికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.
టాక్సీ కొంతదూరం వచ్చాక డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చి, డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో, గిల్ సీట్లోంచి లేచి.. డ్రైవర్‌ను తన సీట్లో కూర్చోబెట్టి, తాను డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి సురక్షితంగా ఆ క్యాబ్‌లోనే ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడికి డబ్బులు చెల్లించేందుకు లేపుదామని ప్రయత్నించినా, అతడు ఎంతకూ లేవలేదు. దాంతో రూ. 500 నోటును డ్రైవర్ ఒళ్లో ఉంచి.. తన ఇంటికి వెళ్లిపోయాడు. టాక్సీ రావడం కూడా అరగంట ఆలస్యంగా వచ్చిందని గిల్ చెప్పాడు. ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండే మాత్రలు వేసుకున్నానని, దానివల్ల తల తిరుగుతోందని డ్రైవర్ చెప్పాడట.