న్యూఢిల్లీ : ప్రయాణ హడావుడిలో సాధారణంగా ప్రయణికులు అపుడపుడూ తమ వస్తువులను మరిచిపోవడం.. ఆనక గాభరా పడడం మనకు తెలిసిందే. అయితే క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ సంస్థ కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా ప్రచురించింది. తమ క్యాబ్‌ల్లో ప్రయాణించేవారిలో ఎక్కువగా వస్తువులు మర్చిపోతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, ఫిలిపీన్స్ దేశాలు ఉన్నాయని ఉబర్ సంస్థ తెలిపింది. శుక్రవారం ఉబర్ యాప్ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రయాణికులు మర్చిపోతున్న వాటిలో మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయట. అలాగే పెళ్లి కానుకలు, బంగారు నగలు ఈ వరుసలో తరువాతి స్థానంలో నిలిచాయని ఉబర్ వెల్లడించింది.
అంతేకాదు ఉబర్ రిపోర్టులో బెంగళూరు నగరం ఎక్కువగా మర్చిపోతున్న నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రయాణికులు ఎక్కువగా మర్చిపోతున్న పది వస్తువులలో ఫోన్స్, బ్యాగ్స్, ఐడి కార్డులు, కళ్లద్దాలు, గొడుగులు ఉన్నాయి. చిన్న చిన్న వస్తువులే కాకుండా ఏకంగా ఎల్‌ఈడి టీవీలు, పిల్లల కోసం వాడే టెంట్ హౌస్‌లు లాంటి పెద్ద వస్తువులను మరిచిపోతున్నారట. ముఖ‍్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వస్తువులను మర్చిపోతున్నారని తెలిపింది. అదీ తరచుగా శని, ఆదివారాల్లో వస్తువులను మర్చిపోతుండటం గమనార్హం.
ఉబర్ మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ.. ఉబర్ ప్రయాణాలలో వస్తువులను పోగొట్టుకున్నపుడు యాప్ ద్వారా ఎలాంటి సహాయం పొందగలరో ప్రయాణికులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా తరచుగా వస్తువులు పోగొట్టుకునే ప్రయాణికులను గుర్తించి వారి వస్తువులను తర్వాతి ప్రయాణంలో అప్పగిస్తున్నామన్నారు. అలాగే రైడ్ ముగిసిన తరువాత తమ వస్తువులను మరోసారి సరిచూసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment