
డమ్మీ విమానానికి సీఐఐ అవార్డు
ముంబై:
వ్యర్థాలతో తయారై పునర్వినియోగానికి అనుకూలమైన డమ్మీ విమానం ఏకంగా సీఐఐ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. మాక్ డ్రిల్‌లో భాగంగా దీనిని ఇటీవల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఏఐఎల్)లో దహనం చేశారు. సీఐఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఇది 30వ రెనోవేటివ్ కైజెన్ కాన్ఫరెన్స్ అండ్ కాంపిటిషన్ అవార్డును దక్కించుకుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి రెండున్నరేళ్లకోసారి నిర్వహించే అత్యవసర డ్రిల్‌కోసం వాడివదిలేసిన విమానాన్ని కాకుండా ఓ డమ్మీ విమానాన్ని సిద్ధం చేయాలని ఎంఏఐఎల్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్ బృందం ఆలోచించింది.
ఈ విషయమై ఎంఏఐఎల్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ‘డమ్మీ విమానానికి నిప్పంటించి అనంతరం డ్రిల్ నిర్వహించాలనే మా ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇది అంతర్జాతీయంగా అనూహ్యరీతిలో అందరి మెప్పు పొందింది. దీంతోఅవార్డు కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ డమ్మీ విమానం తయారీకి రెండు నెలల సమయం పట్టింది. మాక్‌డ్రిల్ అనంతరం కూడా వినియోగించేలా ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్ బృందం దీనిని రూపొందించింది.