కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
సర్కారీ కేసులను తగ్గించటమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కక్షిదారు ముద్రను చెరిపివేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని.. న్యాయ, సిబ్బంది వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఏదైనా అంశంలో చిట్టచివరి అవకాశంగా మాత్రమే కోర్టును ఆశ్రయించేలా చూసేందుకు, గెలిచే అవకాశాలు అంతగా లేని కేసులను కొనసాగించకుండా ఉండేందుకు.. వివిధ మంత్రిత్వశాఖలకు న్యాయ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు న్యాయశాఖ కార్యదర్శి పి.కె.మల్హోత్రా చెప్పారని తెలిపింది. స్థాయీ సంఘం నివేదిక ప్రకారం.. దేశంలో ప్రభుత్వం కక్షిదారుగా ఉన్న కేసుల్లో ఉద్యోగ వివాదాలు, పరోక్ష పన్నులకు సంబంధించిన కేసులే అత్యధికం.
కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వ ఖజానాపై భారంగా మారటమే కాకుండా.. ప్రభుత్వ దృష్టిని కూడా అర్థవంతమైన పాలన నుంచి మళ్లిస్తోంది. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు 46 శాతం కేసుల్లో ప్రభుత్వం కక్షిదారుగా ఉందని న్యాయ శాఖ అంచనా. 2010 నాటికి సుప్రీంకోర్టులో 57,179 కేసులు, 2011 నాటికి 24 హైకోర్టుల్లో 42,17,903 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2010 జాతీయ దావా విధానాన్ని సమీక్షిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం.. ప్రతి ప్రభుత్వ విభాగానికీ ఒక న్యాయాధికారిని నియమించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కార్యదర్శుల కమిటీ అధ్యయనం చేస్తుందని, అనంతరం మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
డీపీపీ లోపాల వల్లే ‘రఫేల్’ జాప్యం:
ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ సంస్థ నుంచి 126 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఖరారు కాకపోవటానికి కారణం.. రక్షణ రంగ కొనుగోళ్ల ప్రక్రియ (డీపీపీ)లో సంక్లిష్టతే కారణమని తాము భావిస్తున్నట్లు.. రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. బీజేపీ ఎంపీ అయిన రిటైర్డ్ మేజర్ జనరల్ బి.సి.ఖండూరి నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం గత వారం తన నివేదికను పార్లమెంట్‌కు ఇచ్చింది. భారత వైమానిక దళం 2012లో రఫేల్ నుంచి 1,200 కోట్ల డాలర్లతో 126 జెట్ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది.
ఇందులో 16 విమానాలను ఆ సంస్థ తయారు చేసిన విమానాలను కొనుగోలు చేసేలా.. మిగతా వాటిని సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఒప్పందం ద్వారా భారత్ తన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) సంస్థ తయారు చేయాలన్నది ఒప్పందం. అయితే.. ధర విషయంలో, హెచ్‌ఏఎల్ తయారు చేసే విమానాల యాజమాన్యం విషయంలో విభేదాలు తలెత్తటంతో ఆ ఒప్పందం ఖరారు కాకుండా నిలిచిపోయింది. చివరికి గత నెలలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఎట్టకేలకు ఒప్పందం ఖరారైంది. ఈ నేపథ్యంలో వైమానిక దళానికి అత్యవసరమైన యుద్ధ విమానాల కొనుగోళ్లలో జాప్యానికి డీపీపీలో ఉన్న లోపాలు కారణమని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది.
ఈ-వ్యర్థాల నియంత్రణకు సమర్థ వ్యవస్థ కావాలి: పార్లమెంటరీ కమిటీ
దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ-వ్యర్థాలను తెచ్చిపోసే చెత్తకుప్పగా భారతదేశం మారిపోకుండా నిరోధించటానికి చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ-వ్యర్థాల నిర్వహణ అనేది ఒక పెద్ద ప్రపంచ సమస్య అని పర్యావరణ మంత్రిత్వశాఖకు గ్రాంటులు కోరే కమిటీ (2015-16) అభివర్ణించింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఈ-వ్యర్థాలను.. వాటి వల్ల వచ్చే ప్రమాదాలను బదిలీ చేయటానికి, వాటిని సరైన పద్ధతిలో రీసైకిల్ (పునర్వినియోగం) చేయకుండా తప్పించుకునేందుకు.. వినియోగించిన వస్తువుల ముసుగులో వర్ధమాన దేశాలకు తరలిస్తున్నాయని పలు నివేదికలు చెప్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ-వ్యర్థాల నిర్వహణ సమస్యను ఎదుర్కొనేందుకు.. అవసరమైన ప్రభుత్వ విధానం, చట్ట నిర్మాణం, సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పింది.
ప్రతి శాఖకు న్యాయాధికారి!
Published Mon, May 4 2015 12:40 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement