భోపాల్: శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు వచ్చే సెప్టెంబరుకల్లా సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం పేర్కొంది. అందుకు అవసరమైన పరికరాలు తమకు 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయంది. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మీకేం కావాలని కేంద్రం అడిగింది. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాల కొనుగోలుకు నిధులు కావాలని మేం అడిగాం.
నిధులు మంజూరు కావడంతో.. అవసరమైన యంత్రాలను సమకూర్చుకుని వచ్చే సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికలకు మేం సిద్ధంగా ఉంటాం’ అని ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలి ఎన్నికల్లో వీవీపీఏటీ యంత్రాలను ఉపయోగించిన విషయాన్ని రావత్ గుర్తు చేశారు. సెప్టెంబరు కల్లా తమకు 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలు సమకూరుతాయని చెప్పారు. కేంద్రం నుంచి ఈసీకి వీవీపీఏటీ యంత్రాల కొనుగోలు కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కొనుగోలు కోసం రూ.12 వేల కోట్లు అందినట్లు ఆయన వెల్లడించారు.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై స్పందిస్తూ.. ‘దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు, సాంకేతికతతో మేం సెప్టెంబరుకల్లా సిద్ధంగా ఉంటాం. అయితే అవసరమైన న్యాయపరమైన సవరణలు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే విషయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడం, పారదర్శకత కోసం పేపర్ బ్యాలెట్‌పైనే ఎన్నికలు నిర్వహించాలని కోరడం తెలిసిందే.
పేపర్ బ్యాలట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలంటూ దాదాపు 16 పార్టీలు ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇకపై ఈవీఎంను ఉపయోగించే ప్రతి ఎన్నికలోనూ వీవీపీఏటీ యంత్రాలను కూడా వినియోగిస్తామని ఈసీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఓటరు ఈవీఎం ద్వారా ఓటు వేసిన వెంటనే వీవీపీఏటీ యంత్రం నుంచి ఒక కాగితం బయటకు వస్తుంది. అది వీవీపీఏటీ యంత్రానికి అనుబంధంగా ఉన్న ఒక గ్లాస్ బాక్స్‌లో పడుతుంది. ఆ కాగితంపై ఓటరు ఏ పార్టీకి ఓటు వేశాడో.. ఆ పార్టీ గుర్తు ఉంటుంది. దాన్ని ఓటరు కేవలం చూసుకోగలడు కానీ తీసుకెళ్లలేడు.
ఈఆర్‌వో నెట్‌వర్క్ ఆవిష్కరణ: ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) నెట్‌వర్క్ అనే వెబ్ అప్లికేషన్‌ను రావత్ ఆవిష్కరించారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న ఎన్నికల అధికారుల సమన్వయానికి ఈఆర్‌వో నెట్‌వర్క్ ఉపకరిస్తుందనీ, నకిలీ ఓటర్లను కనిపెట్టడంలోనూ ఇది ఉపయోగపడుతుందని రావత్ చెప్పారు. పౌరులు ఓటు హక్కు కోసం కూడా ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాబోయే కాలంలో ఈ–ఓటింగ్ సౌకర్యాన్నీ తెస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రతాదళాల్లో ఉన్నవారి కోసం ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈ ఈఆర్‌ఓ కూడా ఆ దిశగా తీసుకున్న చర్యలేనన్నారు.
ఈసీకి అందిన కేంద్ర నిధులు
ఈవీఎంల కోసం రూ.12,000 కోట్లు
వీవీపీఏటీ యంత్రాల కోసం రూ.3,400 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment