మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, అలనాటి డిస్కో డాన్సర్ మిథన్ చక్రవర్తికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. పశ్చిమబెంగాల్ కేంద్రంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్స్ స్కాం కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీవర్గాలు సమన్లు పంపాయి.ఆయన వచ్చేటప్పుడు సంబంధిత పత్రాలన్నింటినీ వెంట తీసుకు రావాలని, కొన్నేళ్ల క్రితం ఆయన శారదా చిట్స్తో చేసిన లావాదేవీల వివరాలు కావాలని ఈడీ తెలిపింది. అయితే, దీనిపై వివరాలు కోరేందుకు ప్రయత్నిచంగా మిథున్ అందుబాటులో లేరు. కేసు దర్యాప్తులో కొన్ని వివరాల కోసమే మిథున్ను కూడా ఈడీ విచారిస్తున్నట్లు తెలిసింది.
గురువారం నాడు కోల్కతాలో ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా మిథున్ చక్రవర్తికి తెలిపారు. శారదా గ్రూపు ఖాతాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు మిథున్ ఖాతాలోకి వెళ్లాయి. దీనికి సంబంధించిన వివరాలతో పాటు మరికొన్ని ప్రశ్నలను కూడా ఈడీ అడిగే అవకాశం కనిపిస్తోంది. శారదా గ్రూపునకు చెందిన ఓ మీడియా సంస్థకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, శారదా చిట్స్ కేసులో ఇప్పటికే ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద పలువురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చాలామంది ఎంపీలను విచారించింది. ఇప్పుడు మిథున్ చక్రవర్తి వంతు వచ్చింది.