సాక్షి, ముంబై: త్యాగానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని తెగేవరకు లాగకూడదని బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే శివసేన నాయకులకు హితవు పలికారు. లోక్‌సభ, రాజ్యసభ కోసం బీజేపీ ఏడు స్థానాలు శివసేనకు వదలిపెట్టింది. కాని ఇప్పటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో శివసేన ఒక్క స్థానం కూడా బీజేపీకి వదలలేదు. ఇలా తరుచూ తామే త్యాగాలు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు అంగీకరించడంలేదని ఆయన అన్నారు. ముంబైలో శుక్రవారం ఓ సందర్భంలో ఖడ్సే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొదటిసారిగా శివసేన, బీజేపీలు కాషాయకూటమిగా ఏర్పడినప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాల్లో పోటీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
శివసేన 22, బీజేపీ కేవలం 26 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాని గత 25 ఏళ్లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఒక్కసారి కూడా గెలవని అనేక స్థానాలున్నాయి. వాటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైన ఉందని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్థానాల్లో శివసేన ఓడిపోవడంవల్ల కాంగ్రెస్, ఎన్సీపీలు లబ్ధిపొందుతున్నాయి. ఆ అవకాశం ఆ పార్టీలకు ఇచ్చే బదులు తమకిస్తే గెలిచే ప్రయత్నాలు చేస్తామని ఖడ్సే అభిప్రాయపడ్డారు.
సేనకు బీజేపీ తాజా ప్రతిపాదన
పొత్తు భగ్నమయ్యే దిశగా సాగుతున్న సీట్లపంపిణీ గొడవను ముగించేందుకు గాను శివసేనకు మరో తాజా ప్రతిపాదన పంపాలని బీజేపీ నిర్ణయించింది. ‘‘మేము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల సంఖ్యపై శివసేనకు ఓ ప్రతిపాదన పంపుతాం. గత 25 ఏళ్లలో శివసేన ఎన్నడూ గెలుపొందని సీట్లు 59 ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా గెలవని సీట్లు 19 ఉన్నాయి. ఈ వాస్తవాన్ని పరిశీలించాలని శివసేను కోరుతున్నాం. ప్రతి సీటుపై చర్చ జరగాలి’’అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ ముంగంటివార్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రితంసారి (2009) తాము పోటీ చేసిన 119 సీట్లనే శివసేన తమకు కేటాయించాలనుకున్నట్లు మీడియా ద్వారానే తెలిసిందని ఆయన చెప్పారు.
పొత్తు కొనసాగాలనుకుంటున్నామని, అయితే తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి స్నేహ సంబంధాలను కొనసాగించబోమని ముంగంటివార్ తేల్చి చెప్పారు. శివసేన కోరిన విధంగా గతంలో ఆరు లోక్‌సభ సీట్లు అదనంగా కేటాయించామని గుర్తు చేశారు. ఎన్డీయే తీసుకున్న అధికార వైఖరికి విరుద్ధంగా శివసేన వెళ్లినప్పటికీ తాము అభ్యంతరం చెప్పలేదని అన్నారు. రాష్ట్రపతి పదవికి ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీకి మద్దతునిచ్చినా సహించామన్నారు. ప్రధాన మంత్రి పదవికి శరద్ పవార్‌కు కూడా శివసేన మద్దతునిచ్చిందని, అప్పుడు కూడా తాము సంయమనం పాటించామని ముంగంటివార్ పేర్కొన్నారు.
తెగేదాక లాగొద్దు: ఖడ్సే
Published Fri, Sep 19 2014 10:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement