ముంబై: అనుకున్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివాడిగా మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. తాజాగా కేబినెట్‌లో చేరిన మంత్రుల ప్రమాణ స్వీకార తేదీ, సమయాలను ఇష్టమొచ్చినట్టు మార్చడంపై వాగ్యుద్ధం జరిగింది. సర్కారు తమతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ, శివసేన పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని విమర్శించాయి. సభలో విపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ఈ విషయమై మాట్లాడుతూ ‘ఇద్దరు మంత్రులు ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. కాదు..కాదు..ఈ రోజు ఉదయం 9.30 గంటలకు అన్నారు.
ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు మేం పనులను వాయిదా వేసుకున్నాం. మాతో ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ ఏశారు. దీనికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ సమావేశాల ఒత్తిడి వల్ల తాను ఢిల్లీలోనే ఆదివారం సాయంత్రం ఆరింటి వరకు ఉన్నానని పేర్కొన్నారు. ముంబైకి తిరిగి వచ్చాక ఎమ్మెల్యేలందరికీ తేనీటి విందు ఇచ్చి, ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం గురించి గవర్నర్‌కు తెలియజేశానని వివరించారు. ఆదివారం మధ్యాహ్నమే ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ తన కార్యాలయం నుంచి ఎస్‌ఎంఎస్‌లు వచ్చిన మాట నిజమేనని అంగీకరించారు.
దీనిపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. అయితే లిఖిత పూర్వకంగా అందినది మాత్రమే అధికారిక ఆహ్వానం అవుతుందని విశదీకరించారు. దీనికి శివసేన సభాపక్ష నాయకుడు సుభాశ్ దేశాయ్ స్పందిస్తూ ‘ఇక నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లను అధికార సమాచారంగా భావించకూడదా ? శాసనసభ వ్యవహారాల గురించి మాకు తరచూ ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. వాటిని నమ్మకూడదా ?’ అంటూ సీఎంను నిలదీశారు. ప్రమాణ స్వీకారం గురించి ప్రజలను తప్పుదోవపట్టించినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఖడ్సే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తగు చర్య తీసుకోవాలని స్పీకర్ దిలీప్‌వల్సే పాటిల్ ముఖ్యమంత్రికి సూచించారు.
అయినా శాంతించని విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించడంతో ఆయా పార్టీ సభ్యులంతా తలకు కాషాయం తలపాగాలు చుట్టుకొని సభకు వచ్చారు. ఇక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు జితేంద్ర అవాడ్, అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్‌ముఖ్, రిసోడ్ ఎమ్మెల్యే అమిత్ జనక్‌ను సీఎం సభ్యులకు పరిచయం చేశారు.
కేబినెట్‌లోకి మరో ఇద్దరు
ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్‌కు ఇటీవలే మంత్రివర్గంలో స్థానం కల్పించిన పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం.. సోమవారం మరో ఇద్దరికి అవకాశం ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దివంగత నాయకుడు విలాస్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, అబ్దుల్ సత్తార్‌తో గవర్నర్ శంకర నారాయణన్ సోమవారం ప్రమాణం చేయించారు. వీరిద్దరూ మరాఠ్వాడా ప్రాంతవాసులే. సత్తార్ కేబినెట్ మంత్రిగా, దేశ్‌ముఖ్ సహాయమంత్రిగా వ్యవహరిస్తారు. దేశ్‌ముఖ్ లాతూర్‌కు చెందిన వారు కాగా, సతార్ ఔరంగాబాద్‌లోని సిల్లోడ్‌వాసి.
ఎమ్మెల్యే పదవికి ఎంపీల రాజీనామా
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏడుగురు రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. సభ ప్రారంభమైన కాసేపటికి స్పీకర్ పాటిల్ వారి జాబితాను విడుదల చేశారు. రాజీనామా చేసినవ వారిలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాజీవ్ సతావ్ (కాంగ్రెస్), రాజన్ విచారే, సంజయ్ జాదవ్ (శివసేన), గోపాల్ శెట్టి, నానా పటోలే, చింతమాన్ వంగా (బీజేపీ) ఉన్నారు. చవాన్ నాందేడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ హోదాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కూడా సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
మాతో ఆటలా ?
Published Mon, Jun 2 2014 10:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement