సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. జూన్ 3వ తేదీన 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల (ఆంధ్రప్రదేశ్(జూన్ 18న), అరుణాచల్ ప్రదేశ్ (జూన్1న), ఒడిశా (జూన్ 11న), సిక్కిం (మే 27న)) పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిచాలని ఈసీ భావిస్తోంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్‌కు కూడా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్దంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించిన విషయం తెలిసిందే.
దీంతో మార్చి 6వ తేదీన కేంద్ర కేబినెట్ చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రదాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment