కుల కురు క్షేత్రం | election shedule release all party's ready to caste and Strategies | Sakshi

కుల కురు క్షేత్రం

Published Fri, Jan 13 2017 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కుల కురు క్షేత్రం - Sakshi

కుల కురు క్షేత్రం

దాదాపు 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సం‘కుల’ సమరానికి తెరలేచింది.

యూపీలో సం‘కుల’ సమరం.. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో పార్టీల వ్యూహాలు
ప్రత్యర్థుల ఓటు బ్యాంకు కొల్లగొట్టే ప్రయత్నం


దాదాపు 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సం‘కుల’ సమరానికి తెరలేచింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో.. ప్రత్యర్థుల సంప్రదాయ ఓటు బ్యాంకులోకి చొచ్చుకెళ్లే వ్యూహాలకు అన్ని పార్టీలు మెరుగులు దిద్దుతున్నాయి. 44 శాతం ఓబీసీలు, 21 శాతం దళితులున్న యూపీలో కులాల వారీగా ఓటర్ల విభజన తీవ్రంగానే ఉంది. 2007లో బీఎస్పీ 30.4 శాతం ఓట్లతో (206 సీట్లు) అధికారంలోకి రాగా, 2012లో సమాజ్‌వాదీ పార్టీ 29.15 శాతం ఓట్లు సాధించి (224 సీట్లు ) అధికారంలోకి వచ్చింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15 శాతం ఓట్లతో 47 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ రెండేళ్లు తిరిగే సరికి... మోదీ హవా కారణంగా 2014లో ఏకంగా 42.3 శాతం ఓట్లు సాధించింది (80 ఎంపీ స్థానాల్లో 71 గెలుచుకుంది). అసెంబ్లీకి త్రిముఖ పోరులో సాధారణంగా 30 నుంచి 35 శాతం ఓట్లు సాధిస్తే యూపీలో అధికారంలోకి రావొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వివిధ పార్టీల సామాజిక సమీకరణాలపై విశ్లేషణ..!    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌



బీజేపీ (అగ్రవర్ణాలు+ యాదవేతర ఓబీసీలు)
ఎన్నికల్లో ప్రభావం చూపగల అన్ని కులాలను కూడగట్టుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగానే ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా వ్యూహరచన చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో బీజేపీ వైపు మొగ్గు ఉంటుంది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఠాకూర్లలోనూ బీజేపీకి పట్టుంది. మరోవైపు, ఓబీసీల్లో యాదవేతర కులాల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర జనాభాలో 9 శాతం యాదవులు ఉన్నారు. యాదవుల ఆధిపత్య ధోరణి గిట్టని ఇతర బీసీలు, ఎంబీసీలను బీజేపీ చేరదీస్తోంది. తూర్పు యూపీలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కుర్మీలు, కోయిరీలు.. బీసీల్లో యాదవుల తర్వాత ఆర్థికంగా, సామాజికంగా శక్తిమంతులు. ఓబీసీల్లో యాదవులు 19.4 శాతం ఉండగా, ఎంబీసీలు 61.69 శాతం ఉన్నారు.

బీసీల్లో అత్యంత వెనుకబడినవర్గాల (ఎంబీసీ)ల మద్దతు కోసం బీజేపీ చాలాకాలం నుంచే పావులు కదుపుతోంది. నిషాద్, మల్లాహ్, కేవత్, లోనియా, నోనియా, గోలే ఠాకూర్, కుమ్హర్, కశ్యప్, లోద్‌... లాంటి ఎంబీసీ కులాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంబీసీల్లో ఏకంగా 60 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. ఎంబీసీ అయిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య(కుష్వాహ సామాజిక వర్గం)కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ప్రధాని మోదీ కూడా బీసీనే కావడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళుతుండటం కూడా బీజేపీకి లాభించే అంశమని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు, యూపీ దళిత జనాభా(21%)లో జాటవ్‌(చమర్‌)ల వాటా 12%. వీరు తమ సామాజిక వర్గ నేత అయిన మాయావతికే మద్దతిస్తారు. మిగిలిన తొమ్మిది శాతం జాటవేతరులపై బీజేపీ దృష్టి సారించింది. అతి దళితులుగా పిలిచే... పాసీ, ఖాతిక్, కోరి, వాల్మీకి, దోభీ కులాలకు జాటవ్‌లపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని దళిత ఓట్ల శాతాన్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని చూస్తోంది.

బీఎస్పీ (దళిత్‌ + ముస్లిం)
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసారి కొత్త సమీకరణాలకు తెరతీశారు. దళిత (21%), ముస్లిం (19%) కలయికతో బీజేపీని అడ్డుకోవాలన్నది బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యూహం. అలాగే, ముజఫర్‌నగర్, దాద్రీ అల్లర్ల సమయంలో అఖిలేశ్‌ ప్రభుత్వ స్పందనపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు ఈ ఎన్నికల్లో తమవైపు వస్తారని ఆమె ఆశిస్తున్నారు. పశ్చిమ యూపీలో 73 సీట్లలో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 19 శాతమున్న ముస్లింలకు 24 శాతం సీట్లు (97) కేటాయించారు. అలాగే, కేంద్రంలో, రాష్ట్రంలో... రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉండే పరిస్థితిని ముస్లింలు కోరుకోరని ఆమె అంచనా.

ముస్లిం ఓట్లలో చీలిక బీజేపీకే లాభం చేకూరుస్తుందని, అందువల్ల ఎస్పీ, కాంగ్రెస్‌లకు ఓటేయొద్దని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. 2007లో బ్రాహ్మణ– దళిత కాంబినేషన్‌తో అధికారంలోకి వచ్చిన మాయావతి ఈసారి పైకి ముస్లిం– దళిత మంత్రాన్ని పఠిస్తున్నా... బ్రాహ్మణులను వదిలేయలేదు. జనాభాలో 10 శాతం దాకా ఉండే  బ్రాహ్మణులకు 16.5 శాతం సీట్లు (66) కేటాయించారు. మొత్తమ్మీద అగ్రవర్ణాలకు 113 సీట్లు కేటాయించారు. అగ్రవర్ణాల ఓట్లు గంపగుత్తగా  బీజేపీకి పోకుండా చూడాలనేది బీఎస్పీ వ్యూహం. దళితుల్లో విభజనకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దళితులంతా ఐక్యంగా ఉండాలని రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

సమాజ్‌వాదీ పార్టీ (ముస్లిం + యాదవ్‌)
ఎంవై (ముస్లిం– యాదవ్‌) ఫార్ములాతో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల వేళ... ఇంటిపోరులో తలమునకలై ఉంది. పరి‘వార్‌’ సద్దుమణిగి... సైకిల్‌పై స్పష్టత వచ్చాకే సీరియస్‌గా ఎన్నికలపై దృస్టి సారించగలదు. ఇప్పుడు కూడా... ఇదే ఫార్ములా. అయితే దీనికి అఖిలేశ్‌ అభివృద్ధి మంత్రం, క్లీన్‌ ఇమేజ్‌ తొడవుతాయని ఆశిస్తోంది. ములాయంతో ముస్లింలకు అనుబంధం ఎక్కువ. సెక్యులర్‌ పార్టీగా, ముస్లింల ప్రయోజనాలను సంరక్షించే పార్టీగా సమాజ్‌వాదీని నిలబెట్టారు ములాయం. 2012లో ఎస్పీ తొలిసారిగా సొంతబలంతో అధికారం లోనికి వచ్చినపుడు కూడా ముస్లింలలో 39 శాతమే ఎస్పీకి ఓటేశారు. కానీ అదే 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ, మోదీ వ్యతిరేకతతో ఏకంగా 58 శాతం ముస్లిం ఓటర్లు ఎస్పీకి అండగా నిలిచారు.

కాంగ్రెస్‌ (అస్తిత్వ పోరాటం)
2012లో కాంగ్రెస్‌ 11.65 శాతం ఓట్లతో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్‌ ఓటుశాతం 7.5కు పడిపోయింది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉన్న బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు... కాలక్రమంలో ఇతర పార్టీలకు మారిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అస్తిత్వ పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేశ్‌ ఆసక్తితో ఉన్నారు. ఆర్‌ఎల్డీని కూడా కలుపుకొని... ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలనేది అఖిలేశ్‌ ఆలోచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement