ఎన్డీఏ గెలుపు ఖాయం! | Elections 2014: BJP-led NDA leads the race in all exit polls | Sakshi
Sakshi News home page

ఎన్డీఏ గెలుపు ఖాయం!

Published Thu, May 15 2014 2:24 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

Elections 2014: BJP-led NDA leads the race in all exit polls

 తాజా ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడి
ఎన్డీఏ-279, యూపీఏ-103: ‘ఎన్డీటీవీ-హన్స’ అంచనా

 
 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని బుధవారం విడుదలైన తాజా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలు ఉండగా, సాధారణ మెజారిటీ కంటే కాస్త ఎక్కువగా ఎన్డీఏ కూటమికి 279, యూపీఏ కూటమికి 103 స్థానాలు లభిస్తాయని ‘ఎన్డీటీవీ- హన్స’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఇదివరకు ఎన్నడూ లభించనంత ఎక్కువగా 235 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్‌కు కేవలం 79 స్థానాలే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. తుది విడత పోలింగ్ ముగిసిన మే 12న వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఈశాన్య రాష్ట్రాల సంఖ్యలను పరిగణనలోకి తీసుకోలేకపోయామని, అందువల్ల తాజాగా సవరించిన ఫలితాలను విడుదల చేస్తున్నామని ఎన్డీటీవీ తెలిపింది.
 
  ఉత్తరప్రదేశ్‌లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఆ రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 56 స్థానాలను చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. సమాజ్‌వాదీ పార్టీకి 12, బీఎస్పీకి 8 స్థానాలు లభిస్తాయని తెలిపింది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ కూడా మే 12న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను సవరించి, తాజా అంకెలను ప్రకటించింది. తొలుత ఎన్డీఏకు 270-282 వస్తాయని అంచనా వేసిన సీఎన్‌ఎన్-ఐబీఎన్, తన తాజా ఎగ్జిట్ ఫలితాల్లో 274-286 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. వాటిలో ఒక్క బీజేపీనే 230-242 స్థానాలను దక్కించుకుంటుందని తెలిపింది. యూపీఏకు 92-102 స్థానాలు లభిస్తాయన్న అంచనాలో మాత్రం ఈ చానల్ ఎలాంటి మార్పు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement