ఎన్డీయే ‘300’ దాటితే.. | BJP led NDA will once again take Authority | Sakshi
Sakshi News home page

ఎన్డీయే ‘300’ దాటితే..

Published Wed, May 22 2019 1:20 AM | Last Updated on Wed, May 22 2019 4:55 AM

BJP led NDA will once again take Authority - Sakshi

సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది..ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలూ వచ్చేశాయి..ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 11 ఎగ్జిట్‌ పోల్స్‌..! బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే మరోసారి అధికారం చేపట్టనుందని ఘంటాపథంగా చెప్పేశాయి..! ఇదే జరిగితే విజయానికి కారకులెవ్వరు? పరాజితుల పరిస్థితి ఏమిటి? పగ్గాలు చేపట్టే కూటమికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? వీటిపై పరిశీలకులు ఏమంటున్నారో పరిశీలిద్దాం..కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు నిజమైన పక్షంలో అసలు విజేత..నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీనే! కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో రెండుసార్లు ఎన్నికల్లో విజేతగా నిలవడం ఇందిరాగాంధీ తరువాత సాధ్యమైంది ఒక్క మోదీకే.

ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులేస్తూ, ఢీ అంటే ఢీ అనేట్లుగా సాగిన మోదీ ప్రచారం ముందు కూటములేవీ నిలబడలేక పోయాయని చెప్పాలి. బీజేపీ తరఫున ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని రెండోసారి అధికారం చేపట్టబోయే వ్యక్తి కూడా మోదీనే. ఈ పరిణామాలన్నీ పార్టీలో, ప్రజల్లో బలమైన నేతగా మోదీ స్థానాన్ని సుస్థిరం చేయనున్నాయి. విజేత మోదీ పరిస్థితి ఇలా ఉంటే పరాజితుడిగా మిగిలిపోయే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉండనుంది. దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్‌ తాజా వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటుందనడంలో సందేహం లేదు.  అధ్యక్షుడిగా రాహుల్‌ పనితీరును పార్టీ  బేరీజు వేస్తుంది. ఈ సమయంలో రాహుల్‌ వ్యతిరేక గళం వినిపించే అవకాశమూ ఉంది.

బీజేపీ ముందున్న సవాళ్లు...
2014 –19 సంవత్సరాల్లో మోదీ తన ఎజెండాను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకు రాలేకపోవడానికి పార్లమెంట్‌లో సంఖ్యాబలం ఒక కారణం. లోక్‌సభలో ఆధిక్యం ఉన్నా.. రాజ్యసభలో బలం లేకపోవడంతో అనేక బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. తాజా ఎన్నికల తరువాత ఈ పరిస్థితిలో మార్పు వస్తే బీజేపీ ముందుగా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తుంది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

కశ్మీర్‌ చట్టాలు ఏమవుతాయి?
మోదీని మళ్లీ అధికారంలోకి తెస్తే కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని బీజేపీ పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్‌ 35ఏపై కూడా బీజేపీ అభ్యంతరం చెబుతోంది. కేంద్రంలో మెజారిటీ ఉన్నా, కశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈ చట్టాలను రద్దు చేసేందుకు ఏన్డీయే ప్రయత్నించలేదు. మళ్లీ కేంద్రంలో అధికారం చేపడితే ఏమవుతుందో వేచి చూడాలి. అయితే, ఈసారి బీజేపీ ప్రభుత్వం సైనిక పాటవాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
మందిరం నిర్మాణమవుతుందా?
బీజేపీకి అధికారం దక్కడంలో రామమందిరం అంశం చాలా కీలకమైంది. 2014– 19 మధ్యకాలంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని బీజేపీ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. ట్రిపుల్‌ తలాఖ్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు మరోసారి ప్రయత్నించేందుకు అవకాశముంది.

అప్పుడు అభివృద్ధి.. మరి ఇప్పుడు?
2014 సమయంలో బీజేపీ విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన అంశం..అభివృద్ధి. స్వచ్ఛ భారత్, ఉజ్వల, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినా జీఎస్టీ అమలులో లోపాల కారణంగా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందని ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం అలాంటి విధాన నిర్ణయాలకు దూరంగా ఉండవచ్చు. వృద్ధి రేటు మందగమనం, నిరుద్యోగ సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారనుంది. వీటితోపాటు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర చర్చకు దారితీసిన ‘అసహనం’ అంశం మరోసారి ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement