
'సుమ' భిక్షాటన చేసింది.. ఫైన్ కట్టాల్సిందే!
చెన్నై: ఆలయ ఏనుగులతో భిక్షాటన చేయించడం వన్యమృగ హింసా చట్టం కింద నేరమని, ఇందుకు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నై హైకోర్టులో శేఖర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన వద్ద ఉన్న సుమ, రాణి అనే పేరుగల ఏనుగులు ఉండగా.. సుమను కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉత్సవాల కోసం గతేడాది మే 17 నుంచి 30 వరకు పంపానని పిటిషనర్ తెలిపాడు.
ఆ ఏనుగుతో పాటు ఇద్దరు మావటి వాళ్లను కూడా పంపాడు. అయితే, ఉత్సవాల తర్వాత సుమ అనే ఏనుగును తిరిగి పంపకుండా, భిక్షాటన చేయించారు. ఇలా చేసినందుకు అధికారులు శేఖర్ యాజమాన్య హక్కును రద్దు చేసి, జరిమానా విధించారు. అయితే, ఏనుగు భిక్షాటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రద్దు చేసిన యాజమాన్య హక్కును తిరిగి ఇప్పించాలని, తన నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఏనుగులతో భిక్షాటన చేయించడం చట్ట ప్రకారం నేరం కాబట్టి జరిమానా విధించడం సమంజసమేనని తీర్పు ఇచ్చారు.