
ఏడు గంటల నరకం.. ఆపై మరణం
జల్పాయ్ గురి: అసలే భారీ కాయం.. ఆ దారంతా బురదమయం.. ఒక్క తప్పటడుగు.. అంతే.. కాలుజారీ వర్షం నీళ్లతో నిండి ఉన్న కాలువలోకి జారిపోయింది. కాపాడాల్సినవాళ్లు చేతులెత్తేశారు. దీంతో ఏడుగంటపాటు నరకం అనుభవించిన ఓ ఏనుగు మంగళవారం సాయంత్రం మరణించింది. విదారకమైన ఈ ఘటన జైపూర్ లోని జల్పాయి గురి జిల్లా బిన్నాగురిలో చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి బిన్నాగురిలోని కర్బా టీ తోటల్లోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. కొద్దిసేపటికే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు. కానీ ఏనుగును కాలువ నుంచి బయటికి తీసే యంత్రాలేవీ వారికి అందుబాటులో లేవు. దీంతో మరో ప్రాంతం నుంచి కుంకీని రప్పించాలనుకున్నారు. కుంకీ అంటే ఫారెస్టు అధికారులచే శిక్షణ పొందిన ఏనుగు. కాగా, కుంకీ రాక అంతకంతకూ ఆలస్యమయింది. క్రేన్ లేదా ఏదైనా భారీ యంత్రంతో ఏనుగును బయటికి తీద్దామనుకుంటే అ ప్రాంతమంతా బురదే!
ఇక చేసేదేమీలేక అధికారులు మిన్నకుండిపోయారు. మూడింట రెండొంతుల నీళ్లలో ఏడుగంలపాటు నరకం అనుభవించిన ఆ ఏనుగు చివరికి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కుంకీ అక్కడికి చేరుకుంది. ఏనుగు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అది ఎలా చనిపోయిందో తేల్చిచెప్పే ప్రయత్నంలో ఉన్నారు డాక్టర్లూ, అటవీ అధికారులూ!