సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, అఖిలభారత సర్వీసు అధికారుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ జేడీ శీలం అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘రాష్ట్ర విభజన జరగగానే అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేశాం. తుది కేటారుుంపు ప్రక్రియ పూర్తిచేసేందుకు అపాయింటె డ్ డే జూన్ 2 నుంచి ఏడాది కాలం పాటు మాకు గడువు ఉంది. అంతకంటే ముందుగానే పంపిణీ పూర్తిచేస్తాం. సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది.
ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. ఆ కమిటీ అందరితో సంప్రదింపులు జరిపింది. స్థానికత, ఆప్షన్లు ఇలా అనేక రకాల అంశాలతో పూర్తి పారదర్శకతతో ఈ పంపిణీ ఉంటుంది. అందువల్లే కొంత సమయం తీసుకుంటున్నాం. కేటాయింపు వివరాలను ప్రకటించిన తరువాత ప్రతి అధికారి నుంచి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తాం. అలాగే రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి కమల్‌నాథన్ కమిటీ పనిచేస్తోంది.
ఈ కమిటీ ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించే పనిలో ఉంది...’ అని పేర్కొన్నారు. జేడీ శీలం మాట్లాడుతూ.. ‘శాశ్వత కేటాయింపులు లేకపోవడంతో పాలనలో అనిశ్చితి నెలకొంది. అధికారులు తమ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియక, విధులు సక్రమంగా నిర్వర్తించలేని గందరగోళంలో ఉన్నారు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రధాని సమావేశం ఏర్పాటుచేయాలి..’ అని కోరారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ ‘ఎఫ్ 18 నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనిని సమీక్షించాలి. పాలన సజావుగా సాగడం లేదు’ అని పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.ఎస్.చౌదరి సైతం పాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు. సభ్యులంతా ఉద్యోగుల పంపిణీకి కచ్చితమైన గడువు చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ‘కొన్ని వారాల్లోనే పూర్తవ్వొచ్చు..’ అని మంత్రి చెప్పారు.
వీలైనంత త్వరగా ఉద్యోగుల పంపిణీ : జితేందర్‌సింగ్
Published Fri, Aug 15 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement
Advertisement