Jitender Singh
-
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కారణంగా తాజాగా మరో ఆకస్తికర ఘటన చోటుచేసుకుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్‌తో ఢిల్లీలో ఓ పాఠశాల పేరును మార్చివేశారు. వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో టీకా లాల్ తాప్లూ పేరుతో ఓ పాఠశాల ఉంది. కాగా, ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో టికా లాల్ తాప్లూ పేరును ప్రస్తావిస్తూ.. కాశ్మీర్లో జరిగిన మారణహోమంలో అతడు మృతి చెందినట్టు చూపించారు. ఈ నేపథ్యంలో అతడి గౌరవార్ధం పాఠశాల పేరును 'షహీద్ టీకా లాల్ తాప్లూ'గా మార్చారు. కాగా, పాఠశాల పేరు మార్పు సందర్బంగా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "తాప్లూ జీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు, జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయవాది" అని అన్నారు. అతనో గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. సెప్టెంబరు 14, 1989న తీవ్రవాదుల చేతిలో హతమార్చబడిన కాశ్మీరీ పండిట్ల గొప్ప నాయకుడని కీర్తించారు. దేశ విభజన తర్వాత, కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశంలోని ప్రజలలో కాశ్మీరీ హిందువులపై "మారణహోమం" గురించి అవగాహన కల్పించిందని తెలిపారు. -
‘సివిల్స్’ అటెంప్ట్‌లు, వయోపరిమితిని సడలించం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్ ఎగ్జామ్ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ సక్రమంగా పాటిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. -
8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్‌సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు. -
ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రశ్నలకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పదవీ విరమణ చేసిన వారితో సహా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంతో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెబ్యునల్‌ను విశాఖలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా కేంద్రం వద్ద ఉందా అని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా జవాబిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఉన్నచోట కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికపైన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెబ్యునల్‌ను నెలకొల్పవచ్చు అని తెలిపారు. ట్రెబ్యునల్ నిబంధనలకు లోబడి శాశ్వత బెంచ్ ఏర్పాటు ఆవశ్యకత, కేసుల పరిష్కారం వంటి అంశాల ప్రాతిపదికపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదేనని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అప్రాధాన్యమైన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అవుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏవైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోబోతుందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం రాతపూర్వక జవాబిచ్చారు. పాలనాపరమైన చర్యలకు వ్యతిరేకంగా ఏ పౌరుడైనా న్యాయపరమైన పరిష్కారాన్ని పొందే హక్కును రాజ్యాంగంలో పొందుపరిచినట్లు గుర్తుచేశారు. కాబట్టి ఫలానా పాలనాపరమైన చర్యకు వ్యతిరేకంగా కేసు పెట్టాలా వద్దా అనే స్వేచ్ఛ పౌరుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ హక్కును వినియోగించుకుని దాఖలు చేసే ప్రజా ప్రయోజన వ్యాజ్యం చట్ట పరిధిలో ఉందో లేదో నిర్ణయించే సంపూర్ణ అధికారం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉందని మంత్రి కిరణ్ రిజుజు రాతపూర్వకంగా తెలిపారు. -
పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది పెన్షన్ దారులు పీపీవో గురించి ఆందోళన చెందారని.. ఇకపై ఈ కొత్త ఇ-పిపిఓ ద్వారా వారికీ అన్ని రకాల సమస్యలు తొలగనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.(చదవండి: సెకండ్ రౌండ్లో టీకా తీసుకోనున్న మోదీ?!) ఇకపై పెన్షన్ దారులు ఆన్లైన్లోనే పీపీవోను పొందొచ్చు. లాక్ డౌన్లో ఉద్యోగ పదవీ విరమణ చెందిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి పేర్కొన్నారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్లైన్లోనే పీపీవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని తెలిపారు. ఉద్యోగ పదవీ విరమణ చెందిన లేదా ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికీ పీపీవో అవసరం అవుతుంది. కరోనా కారణంగా పెన్షన్ దారులు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఇప్పుడు డిజి-లాకర్‌తో అనుసందించబడిన పిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పిపిఓ కాపీని సులభంగానే పొందవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు భవిష్య అకౌంట్‌ను డిజి లాకర్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. -
ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు రెండు రజతాలు
ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా... టీమ్ విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేశ్, ఆశిష్, జితేందర్ సింగ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున పతకం నెగ్గిన ప్లేయర్‌గా ఫౌద్ మీర్జా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఈవెంట్లో మీర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. యొషియాకి (జపాన్–22.70 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. -
వారికి వ్యతిరేకంగా 26వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా భారీగా అవినీతి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారికి వ్యతిరేకంగా దాదాపు 26వేలకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం నేడు లోక్‌సభకు వెల్లడించింది. ఫిర్యాదులు నమోదైన వారిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా 2017లో 26,052 ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నేడు లోక్‌సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిలో 22,386 ఫిర్యాదులు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. కాగ, 2016లో 51,207 ఫిర్యాదులు, 2015లో 32,149 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో 2016లోని 48,764 ఫిర్యాదులను, 2015లోని 30,789 ఫిర్యాదులను తిరస్కరించినట్టు చెప్పారు. -
పెరుగుతున్న ‘ఆర్టీఐ’ తిరస్కరణలు
న్యూఢిల్లీ: అధికారుల తిరస్కరణకు గురవుతున్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2013–14లో 60,127 తిరస్కరణకు గురికాగా, 2015–16లో వాటిసంఖ్య 64,666కు పెరిగింది. ఈ వివరాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం దాఖలైన దరఖాస్తులన్నింటికీ కావాల్సిన పూర్తి సమాచారాన్ని నిర్ణీత సమయం లోపల అందజేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర సమాచార కమిషన్‌లో 12 ఖాళీలు ఉన్నట్లు వాటిని త్వరలో భర్తీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. -
వాళ్లను ఊహించుకొని.. వీళ్లను చంపేశాడు
* అన్న భార్య, కుమారుడిపై ఉన్న కోపం ఇతరులపై.. * పదిహేను నిమిషాల వ్యవధిలో రెండు హత్యలు * సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో: అన్న భార్య, కుమారుడితో జరిగిన ఘర్షణతో వారిపై కసి పెంచుకున్నాడు... తెల్లవారుజామున సైకిల్‌పై తిరుగుతూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారి వయసున్న ఇద్దర్ని గుర్తించి... అన్న కుమారుడు, వదినల్ని తలచుకుంటూ రాళ్లతో మోది చంపేశాడు... అబిడ్స్, నాంపల్లి ఠాణాల పరిధిలో గత సోమవారం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు హత్యల వెనుక ఉన్న కారణమిది. ఈ ఘాతుకాలకు పాల్పడిన నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారని డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆది నుంచీ వివాదాస్పదుడే... మంగళ్‌హాట్‌లోని సీతారామ్‌బాగ్‌కు చెందిన జితేందర్‌సింగ్(40)కు జిత్తు, జిదుర సింగ్, గల్లుదాదా అనే మారు పేర్లూ ఉన్నాయి. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, ఎనిమిదేళ్ల క్రితం తల్లి కన్నుమూసింది. 23వ ఏట చెట్టు మీద నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన జిత్తు ఆపై అల్లరిచిల్లరగా తిరగడం ప్రారంభించాడు. 12 ఏళ్ల పాటు సమోసా కార్ఖానాలో, మూడేళ్ల పాటు వాటర్ ట్యాంకర్ క్లీనర్‌గా పనిచేసిన అతడు ప్రస్తుతం కార్పెంటర్‌గా జీవిస్తున్నాడు. తరచూ గొడవలకు దిగే ఇతడిపై మంగళ్‌హాట్, హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్ ఠాణాల్లో దాడి సంబంధిత కేసులతో పాటు ఎక్సైజ్ విభాగంలోనూ కేసులున్నాయి. గతంలో దాదాపు నాలుగేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు. వదిన, ఆమె కుమారుడితో ఘర్షణపడి... ప్రస్తుతం దత్తనగర్‌లో అన్న కుటుంబం నివసిస్తున్న ఇంట్లోనే ఓ గదిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. జిత్తుకు వదిన సుచిత్ర, అన్న కుమారుడు దుర్గేష్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ ఇంటికి రావద్దని, గదిని ఖాళీ చేయాలని వారు స్పష్టం చేస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే గత నెల 29 రాత్రి సైతం వీరితో జిత్తుకు ఘర్షణ జరిగింది. దీంతో సుచిత్ర, దుర్గేష్‌లు జిత్తును దూషించడంతో పాటు చేయి చేసుకుని తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఫలితంగా జిత్తు తీవ్ర మనస్థాపానికి గురికావడంతో పాటు ఒకటో తేదీ రాత్రి వరకు సరైన ఆహారం లేక వారిపై కసి పెంచుకున్నాడు. కనిపించిన వారిని చంపేశాడు... అలాంటి మానసిక స్థితితో ఉన్న జిత్తు ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి తన ఇంటి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. ఆసిఫ్‌నగర్ కాంపౌండ్, విజయ్‌నగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, చింతలబస్తీ, లక్డీకాపూల్, పబ్లిక్‌గార్డెన్స్, సంతోష్-స్వప్న థియేటర్స్ రోడ్, సాగర్ టాకీస్ రోడ్, ట్రూప్ బజార్, రామకృష్ణ థియేటర్, అబిడ్స్, ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ మీదుగా తెల్లవారుజాము 3.05 గంటలకు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ యువకుడు జిత్తు కంటపడ్డాడు. అతడిదీ దాదాపు దుర్గేష్ వయస్సే కావడంతో ఆ యువకుడినే దుర్గేష్‌గా ఊహించుకుని తలపై బండతో మోది చంపేశాడు. అక్కడ నుంచి 3.20 గంటలకు రెడ్‌హిల్స్ ప్రాంతానికి వచ్చిన జిత్తుకు అక్కడ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వృద్ధురాలు కనిపించింది. ఆమె వయస్సు తన వదిన వయస్సంతే ఉండటంతో సుచిత్రను ఊహించుకుని బండరాయితో మోది వృద్ధురాలిని చంపేశాడు. సీరియల్ కిల్లర్‌గా భావించిన పోలీసులు... అబిడ్స్, నాంపల్లి ఠాణాల పరిధిలో చోటు చేసుకున్న ఈ రెండు హత్యలూ రెండో తేదీ వెలుగులోకి రావడంతో కేసులు నమోదయ్యాయి. ఘటనా స్థలాలకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు సైకిల్‌పై వచ్చిన ఒకే వ్యక్తి టార్చ్లైట్తో నిద్రిస్తున్న వారిని గుర్తించి, ముందుకువెళ్లి రాయి తెచ్చి రెండు హత్యలు చేసినట్లు గుర్తించారు. ఒకే తరహాలో అకారణంగా జరగడంతో అతడో సీరియల్ కిల్లర్‌గా భావించి అప్రమత్తమయ్యారు. ఇలాంటి హత్య మరోటి జరగకుండా ఉండేందుకు అబిడ్స్ ఇన్స్పెక్టర్ గంగారామ్ నేతృత్వంలో ఏర్పడిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని ఒకచోటికి చేర్చి కాపుకాయడం ప్రారంభించాయి. హత్య కేసుల్ని కొలిక్కి తీసుకువచ్చి, నిందితుడిని పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.జానయ్య నేతృత్వంలో ఆరు బృందాలు రంగంలోకి దిగాయి.22 కెమెరా ఫీడ్ అధ్యయనంతో... రెండు హత్యలు జరిగిన ప్రాంతాలతో పాటు అటు-ఇటు ఉన్న మార్గాల్లోని 22 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. దీంతో నిందితుడు మంగళ్‌హాట్ వైపు వెళ్లినట్లు తేలింది. ఈ ఫీడ్ నుంచి సేకరించిన నిందితుడి అస్పష్టమైన ఫొటో సాయంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ నాగేంద్ర మంగళ్‌హాట్‌లోని బస్తీల్లో ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు స్థానికుల ద్వారా ఆ ఫొటోలో ఉన్నది జిత్తుగా గుర్తించి అబిడ్స్ పోలీసులతో కలిసి అతడి గదిపై దాడి చేశారు. జిత్తు చిక్కడంతో పాటు సైకిల్, టార్చ్‌లైట్ తదితరాలు రికవరీ అయ్యాయి. నిందితుడిని అబిడ్స్ పోలీసులకు అప్పగించామని, ఇతడి అరెస్టులో కీలకపాత్ర పోషించిన వారికి రివార్డ్ ఇస్తామని లింబారెడ్డి తెలిపారు. -
వీలైనంత త్వరగా ఉద్యోగుల పంపిణీ : జితేందర్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగులు, అఖిలభారత సర్వీసు అధికారుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ జేడీ శీలం అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘రాష్ట్ర విభజన జరగగానే అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేశాం. తుది కేటారుుంపు ప్రక్రియ పూర్తిచేసేందుకు అపాయింటె డ్ డే జూన్ 2 నుంచి ఏడాది కాలం పాటు మాకు గడువు ఉంది. అంతకంటే ముందుగానే పంపిణీ పూర్తిచేస్తాం. సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీ కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. ఆ కమిటీ అందరితో సంప్రదింపులు జరిపింది. స్థానికత, ఆప్షన్లు ఇలా అనేక రకాల అంశాలతో పూర్తి పారదర్శకతతో ఈ పంపిణీ ఉంటుంది. అందువల్లే కొంత సమయం తీసుకుంటున్నాం. కేటాయింపు వివరాలను ప్రకటించిన తరువాత ప్రతి అధికారి నుంచి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తాం. అలాగే రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి కమల్‌నాథన్ కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించే పనిలో ఉంది...’ అని పేర్కొన్నారు. జేడీ శీలం మాట్లాడుతూ.. ‘శాశ్వత కేటాయింపులు లేకపోవడంతో పాలనలో అనిశ్చితి నెలకొంది. అధికారులు తమ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియక, విధులు సక్రమంగా నిర్వర్తించలేని గందరగోళంలో ఉన్నారు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రధాని సమావేశం ఏర్పాటుచేయాలి..’ అని కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ ‘ఎఫ్ 18 నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనిని సమీక్షించాలి. పాలన సజావుగా సాగడం లేదు’ అని పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.ఎస్.చౌదరి సైతం పాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు. సభ్యులంతా ఉద్యోగుల పంపిణీకి కచ్చితమైన గడువు చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ‘కొన్ని వారాల్లోనే పూర్తవ్వొచ్చు..’ అని మంత్రి చెప్పారు. -
ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులు
ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు జితేందర్ సింగ్ (39)పై దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపారు. ఢిల్లీలోని తిలక్‌నగర్ ప్రాంతంలో ఆయన ఆఫీసు బయట ఈ సంఘటన జరిగింది. జితేందర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వ్యకిగత వైరంతో ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. జితేందర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల్ని విచారిస్తున్నారు.