సాక్షి, న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కారణంగా తాజాగా మరో ఆకస్తికర ఘటన చోటుచేసుకుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్‌తో ఢిల్లీలో ఓ పాఠశాల పేరును మార్చివేశారు.
వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీకా లాల్ తాప్లూ పేరుతో ఓ పాఠశాల ఉంది. కాగా, ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో టికా లాల్ తాప్లూ పేరును ప్రస్తావిస్తూ.. కాశ్మీర్‌లో జరిగిన మారణహోమంలో అతడు మృతి చెందినట్టు చూపించారు. ఈ నేపథ్యంలో అతడి గౌరవార్ధం పాఠశాల పేరును 'షహీద్ టీకా లాల్ తాప్లూ'గా మార్చారు.
కాగా, పాఠశాల పేరు మార్పు సందర్బంగా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "తాప్లూ జీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు, జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయవాది" అని అన్నారు. అతనో గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. సెప్టెంబరు 14, 1989న తీవ్రవాదుల చేతిలో హతమార్చబడిన కాశ్మీరీ పండిట్ల గొప్ప నాయకుడని కీర్తించారు. దేశ విభజన తర్వాత, కాశ్మీరీ పండిట్‌లపై జరిగిన దాడులపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశంలోని ప్రజలలో కాశ్మీరీ హిందువులపై "మారణహోమం" గురించి అవగాహన కల్పించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment