గడ్కారీ షికారుపై వివాదం
న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు 2013 జూలైలో ఫ్రాన్స్‌లోని ఎస్సార్ కంపెనీకి చెందిన విలాసవంతమైన నౌకలో రెండు రాత్రులు బస చేశారని శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ తదితర పార్టీలు విమర్శలు సంధించాయి. సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని గడ్కారీ స్పష్టం చేశారు. తన జీవితంలో ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు. ఎస్సార్ గ్రూప్ అంతర్గత సమాచారంగా పేర్కొంటూ ఓ ‘ప్రజావేగు’ గడ్కారీ పర్యటన వివరాలు బహిర్గతం చేయడంతో వివాదం మొదలైంది.
కార్పొరేట్ కంపెనీలు తమ ప్రయోజనాల కోసం అధికారం, పలుకుబడి ఉన్న వారిని ఎలా లోబరచుకుంటున్నాయో ఈ ఉదంతం చెబుతోందని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు చెందిన ఎన్జీఓ సీపీఐఎల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్లకు మధ్య సంబంధాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో కానీ, సీబీఐతో కానీ దర్యాప్తు జరిపించాలని భూషణ్ సీపీఐఎల్ తరఫున పిటిషన్ వేశారు.
అన్నీ సొంత ఖర్చులే..గడ్కారీ: వివాదం రేగడంతో గడ్కారీ ముంబైలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ‘పర్యటన నాటికి మంత్రిని కాను, ఎంపీని కాను, ఎమ్మెల్యేను కాను. పర్యటన ఖర్చులన్నీ నా కుటుంబమే పెట్టుకుంది. నేను నార్వే వెళ్తున్న విషయం తెలిసి ఎస్సార్ కంపెనీ వారు ఫ్రాన్స్ తీరంలో తమ విహారనౌకను చూడాలన్నారు. నేను అలాంటిదాన్ని అంతకుముందు చూడలేదు. వారి ఆహ్వానాన్ని అం గీకరించాను. ఫ్రాంక్‌ఫర్ట్‌కు టికెట్ తీసుకుని వెళ్లాను. తర్వాత ‘సన్‌రేస్’ నౌకను సందర్శిం చాను. వాళ్లు రూ. 500 టికెట్ పెట్టినా అందులోకి వెళ్లి ఉండేవాడిని’ అని తెలిపారు.