సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల్లో జాతీయ భావం పెరిగింది. ఫలితంగా దేశంలో ఉన్న 82 శాతం హిందూ మత విశ్వాసకుల్లో దైవ చింతన కూడా పెరిగి దేవతా విగ్రహాల కొనుగోళ్లు కూడా పెరిగిందట. ఏ పట్టణంలో, ఏ బజారుకెళ్లిన మనకు నచ్చే దేవతా విగ్రహాలు ఇట్టే దొరుకుతున్నాయి. అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో మనకు తెలియదు. దుకాణదారుడికి కూడా తెలియకపోవచ్చు, తెలిసినా చెప్పడు. ఎందుకంటే అవన్ని కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయట. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల విగ్రహాలను చైనా మార్కెట్ భారత్‌లో విక్రయించినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వచ్చీరాగానే ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తీసుకొచ్చారు. దానికి విస్తత ప్రచారాన్ని కల్పించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విస్తతంగా ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చైనా వస్తువులు దేశీయంకన్నా చౌకవడమే. డబ్బుల దగ్గరకి వచ్చేసరకల్లా భారతీయులు జాతీయ భావాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క 2016 సంవత్సరంలోనే భారత్ నుంచి చైనాకు 26,400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా, చైనా నుంచి భారత్‌కు 2,09,800 కోట్ల రూపాయల దిగుమతులు జరిగాయి.
భారత్, చైనా మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా చైనాకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. చైనా, భారత్‌ల మధ్య ఎగుమతి, దిగుమతుల నిష్పత్తి రేషియో 6–1గా ఉంది. చైనా వస్తువులు చౌకవడానికి చాలా కారణాలున్నాయి.
కారణాలు.....
1. ఏ వస్తువులనైనా చైనా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఓ భారతీయ ఉత్పత్తిదారుడి వద్ద మూడు ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ యంత్రాలుంటే చైనా ప్రత్యర్థి వద్ద 70 ఉంటాయి. ఎక్కువ యూనిట్లు ఉండి, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుందని తెల్సిందే.
2. మ్యాక్ కిన్సే రిపోర్టు ప్రకారం భారతీయ కార్మికులతో పోలిస్తే చైనా కార్మికుల ఉత్పాదన రేటు నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువ. భారత కార్మికులకన్నా జీతాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ చైనా కార్మికులు జీతంతో పోల్చినా భారతీయులకన్నా ఎక్కువ పనిచేస్తారు. భారతీయ కంపెనీల్లో అత్యాధునిక యంత్రాలు లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, సప్లై చైన్‌ను సరిగ్గా లేకపోవడం తదితర కారణాలే కాకుండా 99 మంది కార్మికుల సంఖ్యను మించకుండా ఉండేందుకు ప్యాక్టరీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం. వందా, ఆపైనా కార్మికులన్న కంపెనీకి 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించడమే అందుకు కారణం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కంపెనీలు నష్టాలు వచ్చినా ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీని మూయరాదు, ఓ ఉద్యోగిని తీసేయరాదు. ఇలాంటి ఇబ్బందులు చైనా కంపెనీలకు లేవు.
3. అవినీతి ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 176 దేశాల జాబితాలో భారత్–చైనా దేశాలు రెండూ కూడా 79వ స్థానాన్ని ఆక్రమించాయి. చైనాలో ఉన్నత స్థాయిలో అప్పుడప్పుడు మాత్రమే అవినీతి జరుగుతుండగా, భారత్‌లో కిందిస్థాయిలో తరచూ జరుగుతుందీ. ఫలింగా ఉత్పత్తిపై చైనా అవినీతి ప్రభావం పెద్దగా ఉండడం లేదు. భారత్‌లో ఎక్కువగా ఉంటోంది.
4. కార్మికుల సమ్మెలు కూడా కారణమే భారత దేశంలో దాదాపు 16 వేల బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. కనుక సమ్మెలు, ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమ్మెలను నియంత్రించేందుకు కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తానని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో సమ్మెల వల్ల ఏటా 2.30 కోట్ల మంది పని దినాల నష్టం జరుగుతోంది. చైనాలో అఖిల చైనా కార్మిక సంఘాల సమాఖ్య అనే ఏకైక కార్మిక సంఘం ఉంది. అది కూడా ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుంది.
5. విద్యుత్ అంతరాయం భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువవడమే కాకుండా సరఫరాలో కూడా అంతరాయం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలకు సరఫరాలో కోత కూడా విధిస్తారు. ఈ పరిస్థితి చైనాలో లేదు. పైగా భారత్‌తో పోలిస్తే చైనాలో రవాణా చార్జీలు కూడా చవకా.
6. స్థలం దొరకడం చాలా కష్టం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు స్థలం దొరకడం భారత్‌లో చాలా కష్టం. ఇరుదేశాల జనాభా దాదాపు ఒకే స్థాయిలో ఉన్న భారత భూభాగం చైనా భూభాగంలో మూడోవంతు ఉంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో కూడా భారత్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బ్యూరోక్రసి ఎక్కువ.
7. ఎగుమతులకు ప్రోత్సాహం చైనా ప్రభుత్వం తమ దేశం నుంచి ఎగుమతులను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అందుకు కారణం 45 శాతం ఉత్పత్తులు ప్రభుత్వరంగానివే కావడం. భారత్‌లో దేశీయ సరకులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment