బాలికలు, మహిళలకు రక్షణ కరువు
భారతావనిలో బాలికలకు, మహిళలకు రక్షణ కరువైంది. ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని కొన్ని ముఠాలు మహిళలను యధేచ్ఛగా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు రవాణా చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మిస్సింగ్ కేసులు నమోదు చేసినా ఛేదించడంలో పోలీసులు విఫలమౌతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు నాలుగు వందలమంది మహిళలు, పిల్లలు అదృశ్యం అవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. దేశంలో ఇప్పటివరకూ సుమారు రెండు లక్షల మంది జాడ తెలుసుకోలేకపోయారు.
2015 సంవత్సరంలో ఇప్పటివరకూ 73,242 మంది మహిళలు తప్పిపోగా, వారిలో సెప్టెంబర్ నాటికి 33,825 మందిని మాత్రమే గుర్తించినట్లు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. దీన్నిబట్టి చూస్తే సుమారుగా రోజుకు 270 మంది మహిళలు కనిపించకుండా పోతున్నట్లు తేలింది. గత సంవత్సరంతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 1లక్షా 35 వేల 356 మంది జాడ తెలుసుకోలేక పోయారు. అలాగే ఈ ఏడాది సెస్టెంబర్ వరకూ పిల్లలు అదృశ్యమైన 35,618 కేసులను బట్టి చూస్తే ఇండియాలో రోజుకు సుమారు 130 మంది పిల్లలు కనిపించకుండా పోతున్నట్లు రూఢి అవుతోంది. వీరిలో కేవలం 19,849 మంది పిల్లలను మాత్రమే పట్టుకోగల్గుతున్నారు. అదే క్రిందటి సంవత్సరంతో కలిపితే మొత్తం 61,444 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
గత దశాబ్ద కాలంలో ముక్కుపచ్చలారని పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల్లో 76 శాతం జోరుగా సాగుతున్న ట్రాఫికింగ్ ద్వారా తరలిపోతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెప్తున్నాయి. భారత దేశంలో మిస్సింగ్ కేసులు ముఖ్యంగా అంతర్ రాష్ట్రీయంగానే జరుగుతున్నట్లు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ 2010 నివేదిక చెప్తోంది. దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్న ట్రాఫికింగ్ ద్వారా తరలిపోతున్న మహిళలు, చిన్నారులు వ్యభిచారం, సెక్స్ టూరిజం, ఇంటిపనులు, వ్యవసాయం వంటి రంగాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే మహిళల మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో అగ్ర స్థానంలో మహారాష్ట్ర నిలుస్తోంది. ఇక మిగిలిన మొదటి ఐదు రాష్ట్రాల్లో నాలుగు ఇండియాలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగుళూరుగా గుర్తించారు. మహిళలను ఇతర ప్రాంతాలకు తరలించి నిషేధిత వృత్తుల్లోకి తరలించే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని చట్టాలు రూపొందించినా అవి కాగితాలకే పరిమితమౌతున్నాయి.