వారికి దిక్కుతోచడం లేదు.. | Every Indian will have house by 2022: PM Narendra Modi | Sakshi
Sakshi News home page

వారికి దిక్కుతోచడం లేదు..

Published Mon, Nov 21 2016 2:33 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

వారికి దిక్కుతోచడం లేదు.. - Sakshi

వారికి దిక్కుతోచడం లేదు..

♦ పెద్ద నోట్ల రద్దుతో టికెట్లు అమ్ముకునే రాజకీయ పార్టీలకు షాక్‌ తగిలింది
♦ చిట్‌ఫండ్‌ కుంభకోణాల వెనుక ఉన్న వారు నన్ను ప్రశ్నిస్తున్నారు

ఆగ్రా: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకునే రాజకీయ పార్టీలకు పెద్ద షాక్‌కు గురిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎస్‌పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం ప్రధాని మోదీ పర్యటించారు. ఆగ్రాలో ‘అందరికీ ఇల్లు’ పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ్‌) మోదటి దశ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా 2019 మార్చి నాటికి కోటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘నోట్ల రద్దుతో కొందరు అన్నీ కోల్పోయారని తెలుసు. మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటే.. చాలా నోట్లను తీసుకెళితే మీరు ఎమ్మెల్యే కావచ్చు. ఇప్పుడు పెద్ద నోట్లను రద్దు చేశాం. ఇప్పుడు ఈ పెద్ద నోట్లతో ఏం చేస్తారు..? ఈ నోట్లు ఇప్పుడు ఎవరికి చెందుతాయి..? ఈ నోట్లు పేదలు, నిజాయతీపరులైన వారివి కాదా..? ఇలాంటి ఆటలకు ఇక్కడితో అడ్డుకట్టవేయాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

వారా నన్ను ప్రశ్నించేది..
పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై మోదీ పరోక్షంగా మండిపడ్డారు. కోట్ల రూపాయల చిట్‌ ఫండ్‌ కుంభకోణాల వెనుక ఉన్న రాజకీయ నాయకులు.. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో తీవ్రంగా కలత చెందుతున్నారని, అందువల్లే దానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతుందనే భయంతో 70 ఏళ్లుగా నల్లధనంపై నోరుమెదపలేదనన్నారు.

‘‘నాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారు ఎలాంటి వారో నాకు తెలీదా..? చిట్‌ ఫండ్‌ వ్యాపారంలో ఎవరి డబ్బు పెట్టుబడిగా పెట్టారో ప్రజలకు తెలియదా..? లక్షలాది మంది, కోట్లాది మంది పేద ప్రజలు పైసాపైసా కూడబెట్టి చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో పెట్టారు. కానీ.. కొందరు రాజకీయ నాయకుల ఆశీస్సులతో కోట్లాది రూపాయలు అదృశ్యమైపోయాయి. దీంతో చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో డబ్బు పెట్టి మోసపోయిన కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఆ రాజకీయ నాయకుల చరిత్ర ఇది. ఇప్పుడు వారు నన్ను ప్రశ్నిస్తున్నారు’’ అని మమతాబెనర్జీని ఉద్దేశించి ప్రధాని అన్నారు. ‘‘ఇంకా ఎతంకాలం ఈ దేశం నోరుమెదపకుండా ఉండాలి..? వారు(గత ప్రభుత్వాలు) 70 ఏళ్ల పాటు నోరెత్తలేదు. ఈ జాడ్యం వల్ల తలెత్తే సమస్యల గురించి వారికి తెలియక కాదు.. వారి ఆందోళన అంతా అధికారాన్ని కోల్పోతామేమో అనే. అందువల్లే వారు నల్లధనాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు’’ అని కాంగ్రెస్‌ పార్టీపై మోదీ విరుచుకుపడ్డారు.

50 రోజుల ఇబ్బందితో ఉజ్వల భవిత..
‘‘మనది చాలా పెద్ద దేశం. అందులోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది. ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పా. ఇందుకోసం 50 రోజుల సమయం మాత్రమే అడిగాను. దేశంలోని యువత రాతను మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది విజయవంతం అవుతుంది’’ అని పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయంపై మోదీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. పేదలు, నిజాయతీ పరులకు మేలు చేసేందుకే రూ.500, రూ.1,000 నోట్లను రద్దే చేశాం తప్ప.. వారిని వేధింపులకు గురిచేసేందుకు కాదని స్పష్టం చేశారు. 50 రోజులు ఇబ్బందులు ఎదుర్కొంటే.. ముందు తరాలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించవచ్చని చెప్పారు.

నల్ల కుబేరులు అక్రమంగా కూడబెట్టిన నల్లధనం దాచుకునేందుకు జన్‌ధన్‌ ఖాతాదారులను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని, దీని వల్ల చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదం సరిహద్దుల్లో సైనికులను పొట్టనపెట్టుకుంటుంటే.. ఆర్థిక ఉగ్రవాదం.. దేశ ఆర్థిక వ్యవస్థను, యువతను విపత్తులోకి నెడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో మాదకద్రవ్యాలు, నకిలీ నోట్ల చలామణీకి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement