నోట్ల రద్దుతో పరిస్థితి తారుమారు | India's Rs 500 And 1,000 Demonetization Is Lowering Interest Rates | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో పరిస్థితి తారుమారు

Published Thu, Dec 29 2016 1:33 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

నోట్ల రద్దుతో పరిస్థితి తారుమారు - Sakshi

నోట్ల రద్దుతో పరిస్థితి తారుమారు

ఆర్థిక వృద్ధి తాత్కాలిక తిరోగమనం...

కొత్త ఏడాదిలో ఎన్నో సవాళ్లు  
2017పై విశ్లేషకుల మిశ్రమ అభిప్రాయాలు


న్యూఢిల్లీ: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన దేశం 2016 సంవత్సరంలో ప్రయాణాన్ని ఆరంభించింది. కానీ, సంవత్సరాంతానికి వచ్చే సరికి పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనంపై చేపట్టిన దాడి ఫలితంగా స్వల్పకాలంలో వృద్ధి రేటు సహా ఎన్నింటినో త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రతిపక్షాలను ఒప్పించి, మెప్పించి, పార్లమెంటులో కీలకమైన, దేశ పన్నుల వ్యవస్థనే మార్చేసే జీఎస్టీ బిల్లును ఆమోదింప చేసుకున్నా... డీమోనిటైజేషన్‌ దెబ్బకు దాని అమలు సైతం వెనక్కి జరిగింది.   

రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్‌ 8న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో వ్యవస్థలో ఉన్న 86 శాతం నగదు పనికిరాకుండా పోయింది. కొనేందుకు చేతిలో రూపాయి లేని పరిస్థితుల్లో వినియోగం గణనీయంగా పడిపోయింది. ఇది వ్యాపార రంగానికి, దేశ పారిశ్రామిక, తయారీ రంగానికి పెద్ద దెబ్బ అని విశ్లేషకుల అభిప్రాయం. పైగా ఈ నిర్ణయం తెచ్చిన ఆటంకాల వల్ల దేశమంతటినీ ఏకైక మార్కెట్‌గా మార్చే కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కూడా ఆలస్యం అయింది. వాస్తవానికి దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచే అమల్లోకి తేవాలన్నది మోదీ సర్కారు ఆకాంక్ష. మరోవైపు వడ్డీ రేట్లను తగ్గించాలన్నది దేశీయ పారిశ్రామిక రంగం ఆకాంక్ష. అమెరికాలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, దేశీయంగా వడ్డీ రేట్లను తగ్గించలేని పరిస్థితులకుతోడు ద్రవ్యోల్బణ లక్ష్యంపై ఆర్‌బీఐ దృష్టి సారించడం... దివాలా చట్టానికి మెరుగులు, దేశీయ కార్పొరేట్‌ రంగంలో అతిపెద్ద వివాదం అన్నీ కలసి వచ్చే ఏడాది 2017 ముందు ఎన్నో సవాళ్లను ఉంచాయన్నది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం.

నోట్ల రద్దుతో సమస్యలు..: ‘‘సంస్కరణల వల్ల దీర్ఘకాలంలో సంస్థాగత ప్రయోజనాలు ఉంటాయి. కానీ స్వల్పకాలంలో మాత్రం వాటి నిర్వహణ, సర్దుబాటు రూపంలో సమస్యలు ఎదురవుతాయి’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అనలిస్ట్‌ అభిషేక్‌ దంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవైపు డిజిటల్‌ అడుగులు, మరోవైపు జీఎస్టీ అమలుతో మధ్య కాలానికి మంచి జరుగుతుందన్నారు. ఇక, నోట్ల రద్దువల్ల వినియోగం

తగ్గిపోతుందన్నది నిపుణుల ఆందోళన. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, సేవల రంగంపై ఎక్కువ భారం పడుతుందంటున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి, పెట్టుబడులపై ఒత్తిళ్ల వల్ల ఉద్యోగాలు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ 6.5 శాతానికి తగ్గుతుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయమై సింగపూర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిస్ట్‌ ప్రియాంకా కిషోర్‌ మాట్లాడుతూ.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు తక్కువగా ఉంటుందని, దీర్ఘకాలానికి మాత్రం బలమైన వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. 2013–2015 కంటే 2016–19 మధ్య వృద్ధి వేగంగా ఉంటుందన్నారు.

జీఎస్టీ అమలుపై అనిశ్చితి...  
జీఎస్టీతో దేశమంతా ఒకే మార్కెట్‌గా మారుతుందని, పోటీ పెరిగి, పెట్టుబడుల వరద పారుతుందని ఎంతో మంది ఆశించారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జీఎస్టీ అమలులో ఆలస్యం తప్పదని తెలుస్తోంది. జీఎస్టీ అనుబంధ చట్టాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఏకాభిప్రాయం సాధించి పార్లమెంటు ఆమోదం పొందాకగానీ కొత్త పన్ను చట్టం ఎప్పుడు కార్యరూపం దాల్చేదీ తెలిసేది.

తగ్గిన పెట్టుబడులు.. కదలని ప్రాజెక్టులు..
పెద్ద ప్రాజెక్టులపై పెట్టుబడులు, కార్పొరేట్‌ రుణాలు ఈ ఏడాది మందగించాయి. ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో ఈ పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు తక్కువేనని నిపుణుల మాట. పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇవి ఇప్పట్లో కోలుకోకపోవచ్చని హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌  గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు.

బ్యాంకుల ప్రక్షాళన...
దేశీయ బ్యాంకులు తమ బ్యాలన్స్‌ షీట్ల ప్రక్షాళనకు విధించిన గడువు వచ్చే మార్చితో ముగిసిపోతుంది. బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు రూ.6లక్షల కోట్లకుపైమాటే. బ్యాంకుల మొత్తం రుణాల్లో పది శాతం వరకూ ఒత్తిడిలో ఉన్నవే. వసూలు కాని ఈ మొండి బకాయిలకు బ్యాంకులు నిధులు కేటాయించడం ద్వారా తమ బ్యాలన్స్‌ షీట్లను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. మరోవైపు నూతన దివాలా చట్టం ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. ఇది నష్టాల్లోకి జారుకున్న వ్యాపారాన్ని సత్వరమే మూతేసి, మరింత నిరర్ధక ఆస్తులుగా మారకుండా నిరోధించేందుకు తోడ్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రిజర్వ్‌ బ్యాంకు పాలసీ...
ద్రవ్యోల్బణ కట్టడి ఆధారిత ద్రవ్య, పరపతి విధానానికి ఆర్‌బీఐ అధికారికంగా మళ్లింది. వడ్డీ రేట్ల నిర్ణయాన్ని తొలిసారిగా పరపతి విధాన కమిటీ చేతుల్లో పెట్టింది. ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టానికి చేరుకున్నందున వచ్చే ఏడాది ప్రథమార్ధ భాగంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను కొంత తగ్గించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైగా నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై ఒత్తిడులు కూడా ఎక్కువయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement