
కాంగ్రెస్ అధిష్టానం తొందరపడింది: కావూరి సాంబశివరావు
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఫలితంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బతగలనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన మంచి పరిణామం కాదు: కావూరి స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఫలితంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బతగలనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లేపాక్షిలో స్వచ్ఛమైన భారతీయ పట్టు విక్రయ కేంద్రం ‘రేషమ్ ఘర్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అనే కాదు, ప్రస్తుతం దేశంలోని ఏ పార్టీకీ సిద్ధాంతం లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలి? అధికారాన్ని ఎలా చేజి క్కించుకోవాలి? అనే ఆలోచనతోనే ఉన్నాయి’ అని అన్నారు.
తాను ఈ విధానాన్ని సమర్థించబోనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని, విభజనతో మేలు జరుగుతుందని తాను భావించడం లేదని అన్నారు. అధిష్టానం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతోందనే వాదనపై స్పందిస్తూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌పై జోస్యం చెప్పలేను. అద్భుతాలూ జరగవచ్చు’ అన్నారు. ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే అంశంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటివి సహజమన్నారు. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ భవిష్యత్ దెబ్బతిన్నదని, దీనిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడతానన్నారు.