యురిలో సైన్యం విఫలమైంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కి సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపును రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. యూరిలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 20 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఆయన సోమవారం ట్విట్టర్లో స్పందించారు. గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ సందర్భంగా ఉగ్రవాది మసూద్ అజర్ను విడుదల చేసి.. ఎన్డీఏ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడిందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. యూరి ఉగ్రదాడి మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.
పాక్ ప్రభుత్వ సహకారంతో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అని, అయితే తమ క్యాంప్ను రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందనే విషయాన్ని కూడా చూడాలని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. యురి అమరులకు నివాళులు అర్పించిన ఆయన.. అంతర్జాతీయంగా పాక్ను ఒంటరిని చేసేలా భారత ప్రభుత్వం కృషి చేయాలన్నారు.