అది జాత్యహంకారం..
రాహుల్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలపై జైట్లీ
* నల్లధనంపై పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టదు
* నగలపై ఎక్సైజ్ సుంకం ఉపసంహరణ కుదరదు
* బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు ఆర్థికమంత్రి జవాబు
న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాత్యహంకార మనఃస్థితిని ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే..
ఆ వ్యాఖ్య రాజకీయంగా సరైనది కాదని, తెల్లగా (ఫెయిర్) లేని వారు ఆకర్షణీయంగా (లవ్లీ) ఉండబోరన్నది ఆ వ్యాఖ్యల మనఃస్థితిని పేర్కొన్నారు. నల్లధనంపై ప్రభుత్వం ప్రకటించిన పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టే పథకం కాదని ఉద్ఘాటించారు. నల్లధనం వెల్లడించే వారు 30 శాతం పన్ను, 15% సర్‌చార్జి, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు జైట్లీ సోమవారం సాయంత్రం సమాధానం ఇస్తూ.. ఆటంకతత్వం లేకపోతే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. జీఎస్‌టీ, దివాలా బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లను తిరస్కరించారు.
జీఎస్‌టీ అమలు చేయటానికి సన్నాహంలో భాగంగా ఈ సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అలాగే.. రుణ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన వాణిజ్యవేత్త విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లటంపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. చట్ట వ్యవస్థ ఆ రుణాల వసూళ్లకు అడ్డంకిగా మారి, ఆయన తప్పించుకుపోవటానికి వీలు కల్పించిందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. అనంతరం.. బడ్జెట్ కసరత్తులో తొలి దశను పూర్తిచేస్తూ వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
అర్ధసత్యాల బడ్జెట్: విపక్షంఅంతకుముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. బడ్జెట్ అంతా ఎంతో బాగుందన్నట్లు చిత్రిస్తోందని.. అర్థసత్యాలతో నిండి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ‘అచ్ఛే దిన్’ నినాదాన్ని గుర్తుచేస్తూ.. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ఎదిగిన ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే మంచి రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌కు నూరు శాతం మార్కులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్ష రాసే వారిగా, ఆ పరీక్షను పరిశీలించే వారిగా మోదీయే వ్యవహరిస్తున్నారని తారిక్ అన్వర్ (ఎన్‌సీపీ) విమర్శించారు. బడ్జెట్ మధ్యతరగతికి వ్యతిరేకమైనదని సంతోక్‌సింగ్‌చౌదరి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు.
బడ్జెట్‌కు దిశానిర్దేశమేదీ లేదని, అంతా డొల్ల అని ప్రకాశ్‌నారాయణ్‌యాదవ్ (ఆర్‌జేడీ) విమర్శించారు. బడ్జెట్‌లో దూరదృష్టి లేదని తపస్‌మండల్ (టీఎంసీ) తప్పుపట్టారు. రైతులను కాపాడటానికి ఏదైనా చేయాలని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ విజ్ఞప్తిచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం వద్ద ఏ మంత్రదండం ఉందని ధర్మేంద్రయాదవ్ (ఎస్‌పీ) ప్రశ్నించారు. బడ్జెట్ సంతులనంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయని, నగలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని బుట్టా రేణుక (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కోరారు. పలువురు బీజేపీ సభ్యులు బడ్జెట్‌ను ప్రశంసించారు.