లంచాలకు విసిగి...విసిగి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మురదాబాద్ జిల్లా అహ్లాద్‌పూర్ గ్రామానికి చెందిన అమీర్ హుస్సేన్ అనే 54 ఏళ్ల రైతు లంచాల కోసం చేతులు చాస్తున్న అధికారులను చూసి చూసి విసిగిపోయాడు. ఆ విసుగు నుంచి వచ్చిన కోపంతో బుధవారం రాత్రి తన పొలంలో గోధమ పంటను తగులబెట్టుకున్నాడు. అమీర్ తన పొలంలో గోధమ పంట వేశాడు. అది ఏపుగా పెరిగి కోతకొచ్చిన సమయంలో అకాల వర్షాలు పడి 70 శాతం పంట నాశనమైంది. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఎంతో మంది రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు 500 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఈ విషయం తెలిసి నష్ట పరిహారం కోసం అమీర్ హుస్సేన్ కూడా జిల్లా యంత్రాంగానికి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. పంట నష్టాన్ని అంచనా వేయడం కోసం ప్రతి సీనియర్ అధికారి వద్దకు వెళ్లారు. వారు అందుకోసం తమ కింది అధికారులను పురమాయించారు. పొలం వద్దకు వచ్చిన ప్రతి అధికారి లంచం ఇస్తేగానీ పంట నష్టాన్ని అంచనా వేయమని చేయిచాచి మరీ చెప్పారట. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా వారూ పట్టించుకోలేదట.
అధికారుల చుట్టూ తిరిగి..తిరిగి కాళ్లు అరిగాయే తప్ప, పని కాకపోవడంతో విసిగేసి మిగిలిన గోధుమ పంటను తగులబెట్టానని అతన్ని పొలాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు ఆయన వివరించాడు. ‘నా లాంటి రైతులను ఆదుకోవడానికి కాకపోతే 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది?’ అన్న ఆ రైతు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే మీడియా ప్రతినిధులు వెనుదిరిగారు.