
క్షమాపణ చెప్పిన ఫరూఖ్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. తనపై వచ్చిన విమర్శలకు ఆయన శనివారం వివరణ ఇచ్చుకున్నారు. అసలు విషయానికి వస్తే... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. జాతీయ గీతాలాపన సందర్భంగా అందరూ లేచి నిలబడితే, ఆయన మాత్రం ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ దృశ్యం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఫరూఖ్ వ్యవహరించిన తీరుపట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై ఫరూఖ్ మాట్లాడుతూ ఆ సమయంలో తనకు ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. విదేశాల్లో ఉంటున్న తన బంధువుకు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ కాల్ రావటంతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అయితే గీతాలాపన జరిగినప్పుడు తానే నిలబడే ఉన్నానన్నారు. ఈ ఘటనపై ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే, అందుకు తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.
కాగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫరూఖ్ జాతీయ గీతం సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగించింది. గీతాలాపన అయిపోయేవరకూ కూడా ఆయన అలాగే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతునే ఉన్నారు. మరోవైపు ఫరూఖ్ చర్యపై బిజెపి కన్నెర్ర చేసింది. జాతీయగీతాన్ని అవమానించేందుకే ఫరూఖ్ ఈ పని కావాలని చేశారని ఆరోపించింది. ఫరూఖ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దాంతో దిగివచ్చిన ఫరూఖ్ క్షమాపణ చెప్పారు.