పరికిణి పడుచు ఊయల సందడి
భువనేశ్వర్ : రాష్ట్ర సంప్రదాయ పండగ రొజొ సందడి బుధ వారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పంథ్ నివాస్ సముదాయంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
ఆయనతో పాటు ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ హాకీ క్రీడాకారుడు, మాజీ రాజ్య సభ సభ్యుడు దిలీప్ తిర్కి, స్థానిక ఎమ్మెల్యే ప్రియదర్శి మిశ్రా, నగర మేయరు అనంత నారాయణ జెనా, విభాగం కార్యదర్శి ఇతరేతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రమంతటా ప్రదర్శన
రాష్ట్రవ్యాప్తంగా పంథ్ నివాస్ ప్రాంగణాల్లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా తెలిపారు. సంప్రదాయ పండగలో పిండి వంటలది పైచేయి. రొజొ సంబంధిత పిండి వంటలతో ఏర్పాటు చేసే ప్రదర్శనలో సందర్శకుల కోసం విక్రయ సదుపాయం కూడా కల్పించినట్లు మంత్రి వివరించారు.
ఆటపాటల పండగ
రొజొ ఆట పాటల పండగగా ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు దిలీప్ తిర్కి తెలిపారు. ప్రధానంగా కొత్త బట్టలు ధరించి బాలికలు, యువతులు ఊయల ఊగడం ఈ పండగ ప్రధాన సందడిగా పేర్కొన్నారు. రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా పర్యాటకులకు వసతి కల్పించే పంథ్ నివాస్ సముదాయాల్లో ఏటా ఈ ప్రదర్శన ఏర్పాటవుతుంది.
పంథ్ నివాస్ ఆవరణలో ఊయలలు ఏర్పాటు చేయడంతో వచ్చి పోయే యువతులు, బాలికలు సరదాగా ఆటపాటలతో గడిపి సంతోషంగా తిరిగి వెళ్తారు. రాష్ట్రానికి విచ్చేసి పంథ్ నివాస్‌లో బస చేసిన రాష్ట్రేతర పర్యాటకుల దృష్టిని ఈ ఆచార, సంప్రదాయం ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాష్ట్ర వంటకాల రుచి చూపేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని నగర మేయరు అనంత నారాయణ జెనా తెలిపారు.
నోరూరించే ప్రదర్శన
రొజొను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదర్శన 4 రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో పలు రుచికర పిండి వంటకాల్ని ప్రదర్శిస్తున్నారు. అరిసెలు, కకరాలు, అట్లు, మొండా, పొడొ పిఠా, ఖిరొ గొజ్జా ఇతరేతర పిండి వంటకాలు, మిఠాయిలతో కిళ్లీలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. రొజొ పండగ సందడిలో కిళ్లీ అగ్ర స్థానంలో నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment