సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటికే 872 మంది మృత్యువాత పడగా... దేశ వ్యాప్తంగా 27,892 మంది దీని కోరల్లో చిక్కుకున్నారు. కరోనాకు ఇంతవరకు విరుగుడు కనిపెట్టకపోవడంతో.. చికిత్స కంటే నివారణే మేలు అన్నచందంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తూ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలమవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని ప్రకటన చేశారు. తద్వారా కరోనా చైన్‌ను తెగ్గొట్టడంలో ప్రభుత్వం కొంతమేర విజయం సాధించినట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలోనూ లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి రోజుకు సగటున 1500 కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి కేవలం కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం వెలువడిన గణాంకాలు మాత్రమే. కరోనా టెస్టుల సంఖ్య పెరిగితేనే దాని ప్రభావం ఎంతమేర తగ్గింది లేదా పెరిగింది అనే స్పష్టమవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పరీక్షా ఫలితాల ఆధారంగానే వైరస్ వ్యాప్తి తీవ్రతను అంచనా వేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. (బయట తిరిగితే క్వారంటైన్కే ! )
ఉదాహరణకు... దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే మూడో వంతు జనాభా నివసిస్తున్నారు. అయితే అక్కడ ప్రతీ పది మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఇంతవరకు కరోనా టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో 7 శాతం, మహారాష్ట్రలో 7.15 శాతం, గుజరాత్‌లో 6.1 శాతం, తెలంగాణలో 5 శాతం, బెంగాల్‌లో 6.4 శాతం వ్యాప్తి కనిపిస్తున్నది. ఇక దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో కూడా 2.1 శాతం జనాభాకు వైరస్ వ్యాప్తి జరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు)
వీటి ఆధారంగా కేవలం లాక్‌డౌన్ అమలు చేయడం ద్వారానే కరోనాను కట్టడి చేయలేమనే విషయం సుస్పష్టమవుతోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ కేంద్రం కొన్ని రంగాలకు మినహాయింపు ప్రకటించింది. అయితే ఆయా చోట్ల పనిచేసే వారు సామాజిక ఎడబాటు పాటిస్తారా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మందికి కనీసం రెండు పూటలా తిండి దొరికే పరిస్థితి లేదు. అలాంటి వారు పరిశుభ్ర వాతావరణంలో నివసించడం, ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ధారావి లాంటి ప్రాంతాల్లో కరోనా ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి లాక్‌డౌన్ అమలు వల్ల మాత్రమే కరోనా వ్యాప్తిని అరికట్టలేమనే విషయం స్పష్టమవుతోంది. కరోనా పరీక్షల నిర్వహణ వేగవంతం చేస్తేనే మహమ్మారి తీవ్రతను అంచనా వేయవచ్చు. (మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ)
కాగా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించగా 25 లక్షల మందికి కరోనా సోకినట్లు తేలగా.. దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి. అదే విధంగా కరోనా విజృంభించినట్లయితే దేశంలో ప్రతీ 2 వేల మందిలో ఒకరికి మాత్రమే ఆస్పత్రి బెడ్ మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది. అంతేగాకుండా ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్యలో 70 శాతం మందిలో ముందుగా కరోనా లక్షణాలు బయటపడలేదు. అదే విధంగా దేశ వాతావరణ పరిస్థితులు, భారతీయుల జీన్స్ కరోనా నుంచి కాపాడగలవని ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా రోజూవారీ కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య, వైరస్ వ్యాప్తి రేటు తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం ప్రకారం జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్ విముక్తి పొందే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇక అంతవరకు క్రమశిక్షణ పాటిస్తూ... ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుంటూ కరోనా కాలంలో ధైర్యంగా జీవించడం నేర్చుకోవాలి. (లాక్‌డౌన్ కొనసాగింపునకే మోదీ మొగ్గు..!)
Comments
Please login to add a commentAdd a comment