ఛోటా షకీల్ నుంచి బెదిరింపు కాల్స్!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ నుంచి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై రైటర్ కమ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా, నిర్మాత వినోద్ రమణి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. తాము తీసిన మూవీలో కొన్ని సీన్లు డిలీట్ చేయాలని, లేనిపక్షంలో విడుదల చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారని వారు తెలిపారు. డీసీపీ బీకే సింగ్ కథనం ప్రకారం.. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ డి' ప్రమోషన్ ఈవెంట్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి.
ఈ మూవీలో దావూద్ ఇబ్రహీంపై జోకులు ఉన్న సీన్లు, అతడ్ని చెడుకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఖచ్చితంగా తొలగించాలని, లేకపోతే మూవీనే విడుదల చేయవద్దని ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు కాల్స్ వచ్చాయిన వారు ఫిర్యాదుచేశారు. తమకు ముంబైతో సబంధంలేని కారణంగా ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నట్లు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పారు. మొదట వారికి ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ నుంచి కాల్స్ చేసి తాము చెప్పింది చేస్తారా లేదా అని హెచ్చరించారు. సునీల్ గ్రోవర్ (కపిల్ శర్మ షో ఫేమ్) అనే జర్నలిస్టు దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేసే సీన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఇవే సమస్యకు దారితీశానని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ వివరించారు.