ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగ దిగ్గజాల దృష్టి పడింది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ప్రతీ ఏటా జరిపే కార్యక్రమంలో భారత్‌కు సంబంధించిన అనధికారిక చర్చల్లో ఆప్, రానున్న లోక్‌సభ ఎన్నికలు.. ఈ రెండే ప్రధానాంశాలయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావంపై ఆరా
దావోస్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగ దిగ్గజాల దృష్టి పడింది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ప్రతీ ఏటా జరిపే కార్యక్రమంలో భారత్‌కు సంబంధించిన అనధికారిక చర్చల్లో ఆప్, రానున్న లోక్‌సభ ఎన్నికలు.. ఈ రెండే ప్రధానాంశాలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ చూపనున్న ప్రభావం గురించి విదేశీ నేతలు, పెట్టుబడిదారులు భారతీయ ప్రతినిధులను లోతుగా ప్రశ్నించారు. ఆప్ ఢిల్లీ వరకే పరిమితమని, భారత్‌లో ఆప్‌లాంటి కార్యాచరణ కలిగిన పార్టీలు మనజాలవని వారికి భారతీయ నేతలు వివరించారు. అయితే, సుపరిపాలనపై ఆప్ లేవనెత్తిన అంశాలను కొట్టిపారేయలేమని వారు అంగీకరించారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న వార్తలపై కూడా విదేశీయులు భారతీయ ప్రతినిధులను ప్రశ్నించారు.
ఆప్ తెరపైకి రావడంతో అనిశ్చితి పెరిగిందని, అందువల్ల విదేశీ కార్పొరేట్లు ఆప్‌తో కూడా సంప్రదింపుల కోసం యత్నిస్తున్నాయని ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు ‘ఆఫ్ ది రికార్డ్’గా మీడియాకు వెల్లడించారు. మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లుగానే ఆప్‌తోనూ జరుపుతామని భారతీయ పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. సుపరిపాలన, బాధ్యతాయుత ప్రభుత్వం.. ఆప్ వల్ల ఈ రెండు కీలకాంశాలకు ప్రాధాన్యత లభించిందన్నారు.