
శనివారం ఢిల్లీలో రోడ్‌షో సమయంలో జీప్ మీదికెక్కి కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి కొడుతున్న దృశ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడి మోతీనగర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ను ఓ యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆప్ శ్రేణులు ఆయన్ను చితక్కొట్టగా, పోలీసులు కాపాడి స్టేషన్‌కు తరలించారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి బ్రిజేష్ గోయల్ తరఫున కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ నేతలతో కలిసి ఓపెన్ టాప్ జీపులో మోతీనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు కేజ్రీవాల్ అభివాదం చేస్తుండగా, ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు ఒక్క ఉదుటన జీప్ ఎక్కి కేజ్రీవాల్ చెంపపై బలంగా కొట్టాడు. కాగా, కొట్టిన వ్యక్తిని ఢిల్లీలో ఓ చిన్నవ్యాపారం చేసే సురేశ్(33)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీజేపీనే ఈ దాడి చేయించిందని ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. 2014లో ఓ రోడ్‌షోలో కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. మరోవైపు గణతంత్ర భారతాన్ని కాపాడుకునేందుకు తాను ఆప్ తరఫున ప్రచారం చేస్తానని సినీనటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment