పద్నాలుగు సెకన్లు చూస్తే జైలుకే
తిరువనంతపురం: అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ చేసిన సూచనను కొంతమంది మెచ్చుకోగా ఎక్కువమంది మాత్రం సెటైర్లు వేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేధింపులపై అమ్మాయిలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒకమ్మాయి కళ్లలోకి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అన్నారు.
అయినా.. ఇప్పటి వరకు అలాంటి కేసు ఒక్కటీ నమోదుకాలేదని, అలా జరగాలంటే అమ్మాయిలు వేధింపులను అరికట్టే విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. కేరళలో మహిళలు, యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను తన ప్రసంగంలో స్పృషించిన ఆయన ఎవరైనా అసభ్యంగా తాకినా, అభ్యంతరకర భాష వాడినా.. వెనుకాలే ఫాలో అవుతున్నా వెంటనే అమ్మాయిలు స్పందించాలని, వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు. అయితే, మిగితా వ్యాఖ్యల గురించి ఎవరూ పట్టించుకోకున్నా.. ఆయన చెప్పిన 14 సెకన్ల లాజిక్ పై మాత్రం చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర క్రీడల మంత్రి ఈపీ జయరాజన్ స్పందిస్తూ తొలుత ఆయన న్యాయ చట్టాలన్నింటిని తెలుసుకుంటే మంచిదని అన్నారు. ఆయన ఈ పాయింట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని అనుమానం వ్యక్తం చేశారు. మరీ సన్ గ్లాసెస్ పెట్టుకున్నవాళ్లు అమ్మాయిలను చూస్తున్నారని తెలుసుకునేదలా? అని ప్రశ్నించారు. అమ్మాయిలు ఇక అలారం పెట్టుకోవల్సి వస్తుందేమో అని మరికొందరు సెటైర్లు వేశారు. ఇంకొందరమే ఆయన చేసిన సలహా బానే వుంది కానీ.. 14 సెకన్ల లాజిక్ అవసరం లేదని అన్నారు.