కోర్టు ఆవరణలో కాల్పులు
లాయర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అలహాబాద్ హైకోర్టులో ఘటన
అలహాబాద్: లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలహాబాద్ కోర్టు ఆవరణలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఒక లాయర్ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని రోషన్ అహ్మద్‌గా, క్షతగాత్రుడిని ఫిరోజ్ నబీగా గుర్తించారు. అలహాబాద్‌లో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. హైకోర్టు ముందున్న అలహాబాద్-కాన్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం లాయర్లు కోర్టు ఆవరణలోకి ఒక్కసారిగా తోసుకువచ్చారు. అక్కడున్న అధికారులు, లాయర్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో ఆత్మ రక్షణకు ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు.
కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడినట్లు స్థానిక జిల్లా కోర్టు జడ్జి భవ్‌నాథ్ సింగ్ తెలిపారు. కానిస్టేబుల్‌ను గాయపరచిన బుల్లెట్ ఆందోళన చేస్తున్న లాయర్ల నుంచి దూసుకొచ్చిందని వెల్లడించారు. కాగా లాయర్లపై పోలీసుల కాల్పులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు బార్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. మృతిచెందిన లాయర్ అహ్మద్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.