వెబ్ బ్రౌజర్లకు ‘ఫైర్‌బాల్’ ముప్పు
సైబర్ భద్రత సంస్థ చెక్‌పాయింట్ ఈ యాడ్‌వేర్ వైరస్ గురించి వివరిస్తూ చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దీనిని అభివృద్ధి చేశారనీ, బ్రౌజర్లలో నకిలీ సెర్చింజన్లను ప్రవేశపెట్టి వినియోగదారులు తప్పుడు వెబ్‌సైట్స్‌కు వెళ్లేలా చేస్తోందని తెలిపింది. ఈ వైరస్ ప్రభావం భారత్‌లోనే అత్యధికంగా ఉందనీ, మన దేశంలోని 2.53 కోట్ల కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయని చెక్‌పాయింట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలావరకు యాంటీ వైరస్ అప్లికేషన్లు ఫైర్‌బాల్‌ను గుర్తించి, సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయనీ, వినియోగదారులందరూ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్–ఇన్ సూచించింది. బ్రౌజర్లలో వినియోగదారుడి అనుమతి లేకుండానే వివిధ ప్లగిన్‌లు ఇన్‌స్టాల్ కావడం, హోం పేజీలు, సెర్చింజన్లు మారిపోవడం వంటివి జరుగుతుంటే జాగ్రత్తపడాలని పేర్కొంది. వెంటనే ఆ ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనీ, బ్యానర్లు, పాప్–అప్‌లు, యాడ్ నోటిఫికేషన్‌లపై క్లిక్ చేయకూడదని హెచ్చరించింది.