ఇప్పుడు ‘ఆర్టికల్‌ 371’పై ఆందోళన | First Article 370, Then 371 | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ‘ఆర్టికల్‌ 371’పై ఆందోళన

Published Wed, Aug 7 2019 4:10 PM | Last Updated on Wed, Aug 7 2019 4:52 PM

First Article 370, Then 371 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు ఇలాగే ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 371వ అధికరణను రద్దు చేస్తారన్న ఆందోళన ఆయా రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ‘ఏ రెడ్‌ అలర్ట్‌ టు ది పీపుల్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్ట్‌’ అంటూ మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్‌ తన్హావులా సోమవారం సాయంత్రం చేసిన ట్వీట్‌తో ఈ గుబులు బయల్దేరింది.

ముఖ్యంగా నాగాలాండ్‌లో ఈ ఆందోళన ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడంతో ‘అలాంటి ఆందోళన ఏమీ అవసరం లేదు. 371 ఏ ఆర్టికల్‌ కింద మీకు కల్పిస్తున్న హక్కులు పవిత్రమైనవి’ అంటూ నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవీ మంగళవారం నాడు ఓ ప్రకటన జారీ చేశారు. మిజోరమ్, నాగాలాండ్, మనిపూర్, మేఘాలయ, ఆస్సాంలోని కొన్ని ప్రాంతాలకు 371 అధికరణ కింద కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈశాన్య రాష్ట్రాల స్థలాలను కొనుగోలు చేయకుండా నివారించేందుకే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక రాజకీయపరమైన హక్కులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన చట్టాలు కూడా ఏకరీతిగా లేవు.

నాగాలాండ్‌కు వర్తించే ఆర్టికల్‌ 371 ఏ ప్రకారం నాగాల మత, సామాజిక పరమైన అంశాల్లో భారత పార్లమెంట్‌కు సంబంధించిన ఏ చట్టమూ వర్తించదు. నాగాలాండ్‌ రాష్ట్రం ప్రత్యేక శాసనం ద్వారా పార్లమెంట్‌ చట్టాలను వర్తింపచేయవచ్చు. మిజోరమ్‌కు కూడా ఆర్టికల్‌ 371 జీ కింద ఇలాంటి సామాజిక, మత హక్కులు ఉన్నాయి. మణిపూర్‌కు వర్తించే ఆర్టికల్‌ 371 సీ కింద కొండ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ హక్కులు ఆ కొండ ప్రాంతాల జిల్లా కౌన్సిళ్లకు పరిమితంగానే ఉన్నాయి.

నాగాల సాయుధ పోరాటం
ప్రత్యేక నాగాలాండ్‌ దేశం కోసం నాగాలు కొన్ని దశాబ్దాలపాటు సాయుధ పోరాటం జరిపారు. ఆ తర్వాత వారు కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ రాష్ట్రానికి మరింత స్వయం ప్రతిపత్తి కావాలంటూ పలు నాగా గ్రూపులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. వారితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు మధ్యవర్తి రవినే రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ‘మాకున్న హక్కులను రద్దు చేస్తారనే భయం ఇప్పుడు ప్రతి నాగాను వెంటాడుతోంది. మా ప్రత్యేక రాజకీయ చరిత్ర, సామాజిక సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 371 ఏ కన్నా మంచి చట్టాలు కావాలంటూ మేము చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో 371ఏను కేంద్రం రద్దు చేయాలనుకోవడం అంతకన్నా హస్వ దృష్టి మరోటి ఉండదు’ అని నాగా విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు నైనతో అవోమి వ్యాఖ్యానించారు. దేశంలోని మైనారిటీల పట్ల బీజేపీకి ప్రత్యేక అభిమానం లేకపోవడం, పార్లమెంట్‌లో వారికి ఎదురులేకపోవడం వల్ల ఇలాంటి భయాలు నాగాలకు కలుగుతున్నాయని మెజారిటీ నాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘నాగా హొహో’ అధ్యక్షుడు పీ చుబా ఓజికుమ్‌ అన్నారు. ఆర్టికల్‌ 371 గురించి నాగాలు భయపడినంతగా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అంతగా భయపడడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement