అధ్వాన్న రోడ్డు భార్యను మింగేస్తే.. పోలీసులు భర్తను బుక్ చేశారు
బెంగళూరు: ఐటి నగరం బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అధ్వాన్నమైన, గుంతలు తేలిన రోడ్లు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ను పొట్టన పెట్టుకున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన ఆ మహిళ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. స్థానిక సంస్థల అధికారులపై విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్కు చెందిన. 25 సం.రాల స్తుతి పాండే, ఓం ప్రకాశ్ ఇద్దరూ భార్యభర్తలు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ బైక్పై వెళుతుండగా రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెనక కూర్చున్న స్తుతి కిందపడటంతో, ఆమెకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు ఓం ప్రకాశ్ పై హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఉదంతంపై బెంగళూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వాన్నంగా తయారైన రోడ్లను బాగు చేయని స్థానిక అధికారులపై మండిపడుతున్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అధికారులను వదిలేసి, అమాయకుడైన భర్తపై కేసు నమోదు చేయడం పై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే పోలీసు అధికారులు మాత్రం తమ వైఖరిని సమర్ధించుకున్నారు. ఈ కేసును రోడ్డు ప్రమాదం కేసుగా పరిగణించి, డ్రైవర్గా ఉన్న ఓం ప్రకాశ్పై కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ తర్వాత అసలు విషయం తేలుతుందంటున్నారు.
కాగా దీనిపై కర్ణాటక ప్రభుత్వం సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితిని సమీక్షించింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, తగినచర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు అక్టోబర్ 21 నాటికల్లా నగరంలోని పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.