870 కోట్ల లంచం.. మాజీ ఉపముఖ్యమంత్రి అరెస్టు
వివిధ ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు ఇచ్చినందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న నేరంలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత ఛగన్ భుజ్‌బల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు అరెస్టు చేశాయి. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మాణం సహా పలు కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఆయన దాదాపు రూ. 870 కోట్లు లంచాల రూపంలో తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తంలో కొంత భాగాన్ని విదేశాలకు తరలించి, బూటకపు కంపెనీలకు పెట్టుబడుల రూపంలో వెనక్కి తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలలో ఒకటైన ఆర్మ్‌స్ట్రాంగ్ ఎనర్జీ సంస్థ యజమానులు భుజ్‌బల్ కుటుంబీకులే. ఈ కంపెనీపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
మనీలాండరింగ్ చట్టం కింద భుజ్‌బల్‌తోపాటు మరికొందరిపై రెండు ఆర్థిక సమాచార నివేదికల కేసు (ఈసీఐఆర్)లను నమోదుచేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం నాసిక్, ముంబై, థానేలోని భుజ్‌బల్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడులు చేశారు. భుజ్‌బల్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన మద్దతుదారుల నుంచి ఇబ్బంది ఎదురవుతుందేమోనని దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో గల ఈడీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. భుజ్‌బల్ అన్న కొడుకు, మాజీ ఎమ్మెల్యే సమీర్ భుజ్‌బల్‌ను ఈడీ ఫిబ్రవరి 1వ తేదీనే అరెస్టు చేసింది. ఛగన్ కొడుకు పంకజ్‌ను కూడా ప్రశ్నించారు.
అయితే.. ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపేనని ఎన్‌సీపీ వర్గాలు అంటున్నాయి. ఛగన్ భుజ్‌బల్‌ను బలిపశువుగా చేసి వేధిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జితేంద్ర అవద్ అన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్, ఇతర సభ్యులు అందరూ ఈ సంక్షోభ సమయంలో భుజ్‌బల్‌క అండగా ఉంటారని, తామంతా ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు.