
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌కు శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు.
న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్‌ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment