
జమ్మూ: పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్ సాంబా జిల్లాలోని చామ్‌లియాల్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో మీదుగా పాక్ మంగళవారం రాత్రి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మృతిచెందారు.
అమరులైన వారిలో అసిస్టెంట్ కమాండెంట్ జతిందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ నివాస్, కానిస్టేబుల్ హన్స్ రాజ్‌లుగా గుర్తించారు. మరో జవాను చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. బీఎస్‌ఎఫ్ బలగాలు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా.. పాక్ రేంజర్లు ఇలా బరితెగించి ఏకపక్షంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని ఇటీవల జరిగిన బీఎస్‌ఎఫ్-పాక్ రేంజర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే పాక్ కాల్పులకు తెగబడటంతో భారత సైన్యం దీటుగా బదులిచ్చింది.