సరిహద్దుల్లో బుధవారం మళ్లీ కాల్పుల మోత మోగింది. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గస్తీ విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు చనిపోయారు.
జమ్మూ/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బుధవారం మళ్లీ కాల్పుల మోత మోగింది. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గస్తీ విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు చనిపోయారు. బీఎస్‌ఎఫ్ జరిపి న ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్ రేంజర్ల దళానికి చెందిన నలుగురు హతమయ్యారు. కాల్పుల్లో మరణించిన తమ సహచరుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ రేంజర్లు కాల్పులు ఆపాలంటూ తెల్లజెండాలను చూపాల్సి వచ్చింది.
పాక్ కాల్పులకు దీటుగా రెట్టింపు బలగాలతో ప్రతిఘటించాలంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు బీఎస్‌ఎఫ్ బలగాలు పాక్ రేంజర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గస్తీ విధుల్లో ఉన్న సైన్యంపై అంతకుముందు పాక్ ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు తెగబడటంతో ఒక బీఎస్‌ఎఫ్ జవాను మరణించగా, మరో జవాను గాయపడ్డారు. మరణించిన జవానును శ్రీరాం గౌరియా గా గుర్తించారు.
గత 24 గంటల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండవసారి. బుధవారం సాయంత్రం సరిహద్దులో రీగల్ పోస్ట్ ఆవలివైపున పాక్ కాల్పులకు దీటుగా తాము ప్రతిఘటించామని, కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు మరణించారని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ తెలిపారు. తమ సహచరుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వీలుగా కాల్పులు ఆపివేయాలంటూ తెల్లజెండాలు చూపుతూ వారు చేసిన వినతి గౌరవిస్తూ బీఎస్‌ఎఫ్ దళాలు కాల్పులు ఆపివేశాయని ఆయన చెప్పారు.
తాజా పరిస్థితిని పారామిలిటరీ బలగాల డెరైక్టర్ జనరల్ తనకు వివరించగానే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ప్రతిస్పందించారని, పాక్ కాల్పులకు దీటుగా గట్టి సమాధానమివ్వాలని ఆదేశించారన్నారు. భద్రతా దళాలు రెట్టింపు బలగంతో పాక్ సైన్యాన్ని ప్రతిఘటించాలని అంతకు ముందు రక్షణ మంత్రి పారికర్ పిలుపునిచ్చారు.