మళ్లీ బరి తెగించిన పాకిస్తాన్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లుతో పాటు పౌరులు లక్ష్యంగా పాక్ రేంజర్లు మంగళవారం కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ... ఆర్ఎస్ పురా సెక్టార్‌లో కాల్పులు జరపగా ఆరుగురు పౌరులతోపాటు ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్థాన్ సైన్యం సామాన్యులపై తన ప్రతాపం చూపిస్తోంది. సరిహద్దు వెంబడి గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తోంది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా, ఆర్ఎస్ పుర సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. నౌషెరాలో మోటార్లతోనూ దాడులు చేశారు. భారత భద్రతా దళాలు వాటిని బలంగా తిప్పి కొట్టాయి. అయితే పాక్ కాల్పుల్లో జమ్మూలో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు.
ఇక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్థాన్ సైన్యానికి... అంతే స్థాయిలో మన జవాన్లు సమాధానం చెబుతున్నారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో... దాదాపు ప్రతిరోజూ తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో దాదాపు 15 మంది పాక్ రేంజర్స్‌తోపాటు మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
గడిచిన పదకొండు రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35 వేల బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక.. 3000 దీర్ఘశ్రేణి మోర్టార్ షెల్స్‌ను కాల్చాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ రెండువేలు కాల్చాయి. ఈ 11 రోజుల్లో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఇక పాకిస్థాన్ వంకర బుద్ది మారడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరిహద్దులో చొరబాట్లు ఆగడం లేదు. ముఖ్యంగా కశ్మీర్‌లో చొరబాట్లు కొనసాగుతున్నాయి. బలగాల కళ్లుకప్పి గీత దాటేందుకు ముష్కరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. రాత్రి పూట చెట్ల మధ్య నక్కి బోర్డర్ క్రాస్ చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన చొరబాటు యత్నాన్ని బిఎస్‌ఎఫ్ భగ్నం చేసింది.