ఎల్‌ఓసీ వద్ద కాల్పులు
రక్షణమంత్రి జైట్లీ కాశ్మీర్ పర్యటన ముందు కాల్పుల విరమణ ఉల్లంఘన
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ సైనిక బలగాలు శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. భారత సైనిక బలగాలపై భారీ స్థాయిలో కాల్పులకు పాల్పడ్డాయి. మోర్టార్ షెల్లింగ్ జరిపాయి. వీటిని తిప్పికొట్టేందుకు భారత బలగాలు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఎల్‌ఓసీ వెంట మెంధార్ - భీమ్‌బేర్‌గాలి - కేరి క్షేత్రాల్లో శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో భారత సైనిక శిబిరాలపై పాక్ బలగాలు 81 మిల్లీమీటర్ల మోర్టార్ షెల్స్, ఆటోమేటిక్, చిన్నతరహా ఆయుధాలతో కాల్పులు జరిపాయి.
పూంచ్ సెక్టార్‌లోని తార్కుండి వద్ద ఎల్‌ఓసీ సమీపంలో గురువారం బాంబు విస్ఫోటనంలో ఒక భారత జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు గాయపడిన ఘటన మరుసటి రోజు ఈ కాల్పుల ఉల్లంఘన చోటు చేసుకోవటం గమనార్హం. మరోవైపు.. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆ దేశ సైనికాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ భారత్ ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఎల్‌ఓసీ వద్ద పాక్ దళాలపై కాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. భారత బలగాల కాల్పులను పాక్ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌జైట్లీ.. ఆ హోదాలో తొలిసారి శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆ ముందు రోజు పాక్ దళాలు కాల్పులకు తెగబడటాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లా ప్రశ్నించారు.
సరిహద్దులో శాంతి అవసరం: భారత్
‘‘భారత్ - పాకిస్థాన్‌ల మధ్య లేఖా దౌత్యం, సరిహద్దు వెంట శాలువాలు, చీరలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం అంతా మంచిదే! కానీ.. రెండు దేశాల మధ్య శాంతియుత, సుహృద్భావ సంబంధాలు.. చర్చల పునరుద్ధరణకు.. సరిహద్దులో శాంతి, ప్రశాంతత అనేవి అత్యంత అవసరం’’ అని భారత్ స్పష్టంచేసింది. ఎల్‌ఓసీ వద్ద శుక్రవారం పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటన నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. పాక్‌తో సుహృద్భావ సంబంధాలు, చర్చల పునరుద్ధరణకు.. సరిహద్దులో శాంతి నెలకొల్పటం ముందస్తుగా చేయాల్సిన పని అని ఆమె స్పష్టంచేశారు.
మోడీతో ఆర్మీ చీఫ్ సుదీర్ఘ భేటీ
కాశ్మీర్‌లో ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘన నేపధ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమై.. భద్రతా పరిస్థితులు, సైనిక బలగాల సంసిద్ధత గురించి వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకూ సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్, కాబోయే ఆర్మీ చీఫ్, ప్రస్తుత వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో విస్తృత స్థాయి సమీక్ష జరిగిందని.. సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతతో పాటు.. భవిష్యత్ సవాళ్లపైనా చర్చించారని సైన్యం తెలిపింది.