న్యూఢిల్లీ : చతుర్భుజ కూటమి ఏర్పాటు.. అదే సమయంలో ’ఇండో-పసిఫిక్‘ అనే పదాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించడం అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు చైనాకు పోటీగా చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌తో బంధాలను మరింత ధృఢపరచుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐఓఆర్)లో భాగంగా భారత్‌తో ఉన్నత స్థాయి చర్చలకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. మనీలాలో జరిగిన ఇండియా-ఏసియన్ సదస్సులో చతుర్భుజ కూటమి చర్చల అనంతరం భారత్ బంధంపై ఫ్రాన్స్ మరింత ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగేల్మర్ వివరించారు.
ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని నిలువరించాలంటే.. భారత్‌తో బంధాన్ని మరింత ధృఢం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జేన్ యువాస్ డ్రెన్, 2018 ఆరంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రాన్ భారత్‌లో పర్యటిస్తారని ఆయన తెలిపారు.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన అన్నారు. హిందూ మహాసముద్రంలో నౌకా స్థావరాల ఏర్పాటు, ద్వీపాల రక్షణ, ఇతర అంశాల్లో భారత్ సహకారం తమకు అవసరమని ఫ్రాన్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment