సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైన వలస కార్మికుల ఘోసలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనిలేక పస్తులుంటున్న వారి ఆకలు తీర్చేందుకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఉచితంగా రేషన్ సరుకులు అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రెండో భాగం వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డు లేని వలస కార్మికులకు సైతం వచ్చే రెండు నెలల పాటు ఉచితంగా ఆహారధాన్యాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. (రైతులకు భారీగా రుణాలు)
అందులో భాగంగా ఐదు కిలోల బియ్యం లేదా గోధుమతోపాటు ఒక కిలో పప్పు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల సుమారు ఎనిమిది కోట్ల మంది వలస కూలీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టనుందని పేర్కొన్నారు. వలస కూలీలను ప్రభుత్వం విస్మరించలేదన్న విషయాన్ని నొక్కి చెప్పారు. అలాగే రేషన్ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనివల్ల వలస కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు నాటికి "ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు" విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. (ఆర్థిక ప్యాకేజీ ఫస్ట్ పార్ట్.. సవివరంగా)
Comments
Please login to add a commentAdd a comment