ప్రతీకాత్మక చిత్రం
గాంధీనగర్ : సరదాగా ఈత కొడదామని స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లిన బాలుడికి భయానక అనుభవం ఎదురైంది. మొసలి నోటికి చిక్కిన అతడు స్నేహితుల సహాయంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గుంభకరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. సందీప్ కమలేష్(14) అనే బాలుడు స్నేహితులతో కలసి సోమవారం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారంతా కలిసి సరదాగా ఈత కొట్టాలనుకున్నారు. అయితే నీళ్లలోకి దిగిన వెంటనే ఓ మొసలి అతడిపై దాడి చేసింది. క్షణాల్లో అతడి కుడి కాలును నోట కరచుకుని నీళ్లల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో భయంతో అతడు కేకలు వేయడంతో.. తోటి పిల్లలంతా పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చి మొసలిపై విసిరారు. మరికొంత మంది సందీప్ చేతులు పట్టుకుని బయటికి లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాసేపు పెనుగులాట తర్వాత మొసలి సందీప్‌ను విడిచిపెట్టింది.
కాగా సందీప్ ప్రమాదంలో చిక్కుకున్న వెంటనే అతడి స్నేహితులు అంబులెన్సుకు ఫోన్ చేయగా.. వెనువెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడం సులువైంది. ప్రస్తుతం అతడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో సందీప్ కుడి కాలులోని ఎముకలు పూర్తిగా విరిగాయని, మోకాలు కూడా పూర్తిగా పాడైపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇక తోటి పిల్లలు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడని.. అతడి స్నేహితులను వైద్యులు అభినందించారు. భయంతో పారిపోకుండా తన కొడుకు ప్రాణాలు కాపాడారంటూ సందీప్ తండ్రి కూడా వారికి ధన్యవాదాలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment