హార్వర్డ్ మేధావుల నుంచి ప్లంబర్ల వరకు!
ఐఐటియన్లు.. హార్వర్డ్ మేధావులు.. ఒలింపియన్లు.. గాయకులు.. ప్లంబర్లు.. నరేంద్రమోదీ మంత్రివర్గంలో ఇన్ని వర్గాల వాళ్లకు ప్రాతినిధ్యం లభించిందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. కొత్తగా విస్తరించిన మంత్రివర్గంలో అన్ని తరగతుల వాళ్లకు ప్రాతినిధ్యం లభించింది. నిన్న మొన్నటి వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఇప్పుడు రక్షణశాఖను చేపట్టిన మనోహర్ పారిక్కర్ ఐఐటీ బాంబే నుంచి మెటలర్జీలో ఇంజనీరింగ్ చేశారు. ఇక యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా అయితే తొలుత ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత హార్వర్డ బిజినెస్ స్కూల్లో కూడా ఉన్నతవిద్య అభ్యసించారు. సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్యవర్ధన్ రాథోడ్.. ఒలింపిక్స్లో కూడా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బెంగాలీబాబు బాబుల్ సుప్రియో మంచి గాయకుడు.
ఇక విజయ్ సంప్లా అయితే అచ్చంగా సౌదీ అరేబియాలో ప్లంబర్గా పనిచేశారు. కొన్నాళ్లు వ్యవసాయ కూలీగా కూడా ఆయన ఉన్నారు. జీవితంలో తాను చాలాకాలం కటిక పేదరికం అనుభవించానని, కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని సంప్లా చెప్పారు. ఈయన పంజాబ్లో సర్పంచి నుంచి ఎదిగి.. పార్టీ రాష్ట్రశాఖలో అనేక కీలక శాఖలు చేపట్టారు. హోషియార్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తానికి నరేంద్ర మోదీ మాత్రం తన మంత్రివర్గంలో విభిన్న వర్గాల నుంచి మంత్రులను తీసుకున్నారు.