న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ వెళ్లినప్పుడు పాక్ పాల్పడిన దురాగతాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. అవంతి, చేతాంకుల్ వద్దకు పాక్ ప్రభుత్వమే విలేకరుల పేరుతో కొందరిని పంపించి విపరీతమైన ప్రశ్నలు అడిగించి వారిని వేధించిన విషయం వెల్లడైంది. విదేశాంగ శాఖ కార్యాలయంలో జాధవ్‌ను కలిశాక తిరిగి వెళ్లేముందు వారి వద్దకు కొందరు జర్నలిస్టులు వచ్చారు. ‘అమాయకపు పాకిస్తానీల రక్తంతో మీ భర్త హోళీ ఆడుకున్నారు. దీనికి మీరేమంటారు? హంతకుడైన మీ కొడుకును కలిశాక మీకేమనిపిస్తోంది?’ తదితర ప్రశ్నలతో జాధవ్ భార్య, తల్లికి వేదన కలిగించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ప్రశ్నలు అడిగిన విలేకరులకు ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ నుంచి ‘బాగా పనిచేశారు’ అంటూ సంక్షిప్త సందేశాలు వచ్చాయని డాన్ పత్రికలో పనిచేసే ఓ సీనియర్ కరస్పాండెంట్ ట్వీటర్‌లో చెప్పారు. ‘దేశభక్తిని నిరూపించుకునేందుకు ఉత్తమ మార్గం 70 ఏళ్ల మహిళను వేధించడమే అనుకునే పాక్ జర్నలిస్టుల గురించి చెప్పేందుకు పదాలు రావడం లేదు’ అని మరో ప్రముఖ పాత్రికేయురాలు బేనజీర్ షా అన్నారు. అసలు అక్కడున్న వాళ్లంతా జర్నలిస్టులేనా లేక ఐఎస్‌ఐ మనుషులు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాధవ్‌ను ఆయన తల్లి, భార్య నేరుగా కలవకుండా గాజుతెర అడ్డుగా పెట్టడం, ఇంటర్‌కామ్ (ఫోన్)లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతివ్వడం, మంగళసూత్రం, బొట్టు తీయించి, దుస్తులు మార్పించి లోపలకు పంపించడం తదితర పాక్ దుశ్చర్యలు ఇప్పటికే వెలుగుచూడటం తెలిసిందే.
‘ఫోరెన్సిక్’కు చేతాంకుల్ పాదరక్షలు
చేతాంకుల్ పాదరక్షలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షకు పంపినట్లు పాక్ మీడియా తెలిపింది. షూలో కెమెరా, రికార్డింగ్ చిప్ లాంటి వస్తువేదైనా ఉందేమో తెలుసుకోడానికి ల్యాబ్‌కు పంపినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ చెప్పారంది. జాధవ్ కుటుంబ సభ్యులను వేధించామన్న భారత ఆరోపణలను నిరాధారమైనవిగా పాక్ కొట్టిపారేసింది. జాధవ్ భార్య, తల్లితో పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
మొత్తం భారతీయులకు అవమానం: కాంగ్రెస్
అవంతి, చేతాంకుల్‌ను పాకిస్తానీ విలేకరులు వేధించడం మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పేర్కొంది. భారతీయులుగా మనం ఈ చర్యను ఏ మాత్రం సహించకూడదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment